Epstein Files: మరో 30వేల పేజీల పత్రాలు విడుదల- ట్రంప్‌పై ఆరోపణలను ఖండించిన న్యాయశాఖ
ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై న్యాయశాఖ పోస్ట్
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించి మరో 30 వేల పేజీల డాక్యుమెంట్లను అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది. అయితే ఈ ఫైళ్లల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఉన్న కొన్ని ఆరోపణలు పూర్తిగా అసత్యమని న్యాయశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
'ట్రంప్‌పై ఉన్న ఆరోపణలు నిరాధారమైనవి. అవి నిజమై ఉంటే ఇప్పటికే ఆయనపై ఆయుధాల్లా వాడేవారు. 2020 అధ్యక్ష ఎన్నికలకు ముందే ఈ ఆరోపణలను ఎఫ్‌బీఐకి అందజేశాం. అయినప్పటికీ వాటికి ఎలాంటి విశ్వసనీయత లేదు. ఎప్‌స్టీన్ బాధితుల గోప్యతను కాపాడే నిబంధనలతోనే ఈ పత్రాను విడుదల చేస్తోంది. ఇక డాక్టర్ లారీ నాసర్‌కు పంపినట్లు చెబుతున్న ఎప్‌స్టీన్ లేఖ పూర్తిగా నకిలీ అని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) తేల్చింది. లేఖలోని రాత ఎప్‌స్టీన్ హస్తాక్షరాలతో సరిపోలేదు. ఎప్‌స్టీన్ మృతి చెందిన మూడు రోజుల తర్వాతే లేఖకు పోస్టుముద్ర ఉంది. లేఖపై ఉన్న రిటర్న్ అడ్రస్‌లో ఎప్‌స్టీన్ జైలులో ఉన్న వివరాలు, ఖైదీ నంబర్ లేవు. ఇవి రిటర్న్ చేయడానికి తప్పనిసరి. ఈ కారణాలతోనే ఆ లేఖను అప్పట్లోనే అనుమానాస్పదంగా గుర్తించి ఎఫ్‌బీఐకు పంపింది. చట్టం, పారదర్శకత పట్ల మా నిబద్ధత కారణంగానే ఈ పత్రాలను విడుదల చేస్తున్నాం' అని న్యాయశాఖ ఎక్స్పోస్ట్లో రాసుకొచ్చింది.
న్యాయశాఖ విడుదల చేసిన డాక్యుమెంట్లలో ట్రంప్ 1995లో స్థాపించిన మార్-ఎ-లాగో క్లబ్‌కు 2021లో జారీ చేసిన సమన్లు కూడా ఉన్నాయి. ఇవి ఎప్‌స్టీన్ మాజీ స్నేహితురాలు, దోషిగా తేలిన ఘిస్లేన్ మ్యాక్స్‌వెల్‌పై దర్యాప్తులో భాగం. డాక్యుమెంట్లలో, 2019లో ఎప్‌స్టీన్ మృతి చెందిన నెలలోనే, శిక్ష అనుభవిస్తున్న లైంగిక నేరస్థుడు లారీ నాసర్‌కు పంపినట్లు చెపుతున్న ఒక లేఖ కూడా ఉంది. ఈ లేఖపై 'జై ఎప్‌స్టీన్' అనే సంతకం ఉంది. అయితే ఆ లేఖలో ట్రంప్ పేరును ప్రస్థావించకుండా 'our president' అనే పదాలు ఉన్నాయి.
ఎప్‌స్టీన్ ప్రైవేట్ జెట్‌లో ట్రంప్ ప్రయాణం!
ఇక 2020లో ఫెడరల్ ప్రాసిక్యూటర్ల నుంచి వచ్చిన ఓ రహస్య ఈ-మెయిల్ గురించి కూడా తాజాగా విడుదల చేసిన ఫైళ్లల్లో ఉంది. ఇందులో ఎప్‌స్టీన్‌కు సంబంధించి ప్రైవేట్ జెట్‌లో ట్రంప్ అనేకసార్లు ప్రయాణించినట్లు వెల్లడైంది. 1993-96 మధ్యలో ట్రంప్ దాదాపు ఎనిమిదిసార్లు ఇందులో ప్రయాణించారని తెలిసింది. ఇక, తాజా ఫైళ్లలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, పాప్‌స్టార్ మైఖేల్ జాక్సన్‌ల పేర్ల ప్రస్తావన కూడా ఉంది.
సంపన్నుల కోసం మైనర్‌బాలికల అక్రమ రవాణా, వారితో వ్యభిచారం చేయించడం వంటి నేరాలకు జెఫ్రీ ఎప్‌స్టీన్ పాల్పడ్డాడు. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓ ప్రైవేట్ ఎస్టేట్‌లో జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ రాకెట్‌ను నడుపుతున్నాడనే సమాచారం 2005 మార్చిలో వెలుగుచూసింది. 14 ఏళ్ల బాధిత యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. తమ కుమార్తెను ఎప్‌స్టీన్ లైంగికంగా వేధించాడని వారు ఫిర్యాదు చేశారు. జెఫ్రీ ఎప్‌స్టీన్ ఒక బడా ఫైనాన్షియర్. అతడే ఈ రాకెట్‌ను నడిపేవాడని దర్యాప్తులో గుర్తించారు. దీంతో 2006 జులైలో ఎప్‌స్టీన్‌ను అరెస్టు చేశారు. అప్పట్లో అతడు 13 నెలలు జైలులో ఉన్నాడు. అనంతరం విడుదలయ్యాడు. మళ్లీ 2019 జులై 6న ఎప్‌స్టీన్‌ను న్యూయార్క్‌లో అరెస్టు చేశారు. 2019 ఆగస్టు 10న జైలులోనే అనుమానాస్పద స్థితిలో అతడు చనిపోయాడు. ఎప్‌స్టీన్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. ఎప్‌స్టీన్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ, మైకేల్ జాక్సన్ వంటి ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చాక కేసు విచారణను ప్రభావితం చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. దీంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి రాబోయే కొన్ని వారాల పాటు ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల ప్రక్రియ కొనసాగుతుందని ఇటీవల అమెరికా న్యాయశాఖకు తెలిపింది.