Trump : ట్రంప్ కీలక నిర్ణయం..భారత్‌లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్

Update: 2025-08-23 11:00 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య టారిఫ్‌లకు సంబంధించిన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. సెర్గియో గోర్ ప్రస్తుతం వైట్‌హౌస్‌లో పర్సనల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్‌'లో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్‌ను నియమిస్తున్నాను. అంతేకాక, ఆయన దక్షిణ, మధ్య ఆసియా ప్రత్యేక రాయబారిగానూ వ్యవహరిస్తారు. అమెరికాపై ప్రేమ కలిగిన 4000 మందిని ఆయన ఎంపిక చేసి, వారిని తన టీంలో నియమించుకున్నారు. మా ఫెడరల్‌ ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలలోని 95 శాతం ఉద్యోగాలను వారితో భర్తీ చేశారు. ఆయన భారత్‌కు వెళ్లేవరకు వైట్‌హౌస్‌లోనే తన ప్రస్తుత విధులను కొనసాగిస్తారు" అని ట్రంప్‌ తెలిపారు.

సెర్గియో గోర్‌పై ట్రంప్ ప్రశంసలు

ట్రంప్ సెర్గియో గోర్‌ను గొప్ప స్నేహితుడిగా, తన ఉద్యమానికి వీర విధేయుడిగా అభివర్ణించారు. ‘‘చాలా ఏళ్లుగా నాకు అన్ని విషయాల్లోనూ మద్దతిచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో నా విజయం కోసం ఎంతో కృషి చేశారు. నా బెస్ట్‌ సెల్లింగ్‌ పుస్తకాలను పబ్లిష్‌ చేసింది ఆయనే. మా ఉద్యమానికి మద్దతుగా నిలిచిన సూపర్‌ ఫ్యాక్స్‌ను కూడా నడిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశంలో నా అజెండాను అమలు చేయడానికి, దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి నాకు పూర్తిగా విశ్వసించే ఒక వ్యక్తి కావాలి. ఆ విషయంలో సెర్గియో గొప్ప రాయబారి అవుతాడు. సెర్గియోకు నా అభినందనలు’’ అని ట్రంప్‌ తెలిపారు. ఈ నిర్ణయం ఇరుదేశాల సంబంధాలలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News