Pakistan Elections : పాక్ ఎన్నికలపై దర్యాప్తునకు అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం
పాకిస్థాన్లో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం చేసింది. దీన్ని రెండు ప్రధాన పార్టీలు దాదావు ఏకగ్రీవంగా ఆమోదించాయి. పాక్ లో ప్రజా స్వామ్యం, మానవ హక్కుల పరిరక్షణ, చట్టబద్ధ పాలనకు పిలుపునిస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభం, భద్రతా సవాళ్ల మధ్య జీవిస్తున్న పాక్ ప్రజల హక్కుల పరిరక్షణ చాలా కీలకమని తీర్మానం తెలిపింది. నిష్పక్షపాత ఎన్నికలు, ప్రజాస్వామ్య పరిరక్షణలో అక్కడి ప్రజలకు అమెరికా అండగా ఉంటుందని తెలిపింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సామాన్యుల మెరుగైన భవిష్యత్తు కోసం అవినీతిని అరికడుతూ చట్టబద్ధమైన పాలనను అందించాల్సిన అవసరం ఉందని గుర్తుచేసింది. పాక్ ప్రజాస్వామ్య ప్రక్రియల్లో భాగస్వామ్యం కాకుండా ప్రజలను బెదిరించడం, హింసకు పాల్పడడం, నిర్బంధించడం, ఇంటర్నెట్ పై ఆంక్షల వంటి చర్యలను తీర్మానం ద్వారా అమెరికా తీవ్రంగా ఖండించింది.
అమెరికా తీర్మానంపై పాక్ విదేశాంగ శాఖ స్పందించింది. తమ దేశ రాజకీయాలపై పూర్తిస్థాయి అవగాహన లేకుండా చేసిన చర్యగా అభివర్ణించింది. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్న తరుణంలో ఇలాంటి తీర్మానం రావడం సమంజసం కాదని వ్యాఖ్యానించింది. రాజ్యాంగ విలువలు, మానవ హక్కులు, చట్టబద్ధ పాలనకు పాక్ కట్టుబడి ఉందని తెలిపింది.