USA Tariffs: ట్రంప్‌ టారిఫ్‌ వార్‌..

చైనా, కెనడా, మెక్సికోపై భారీగా సుంకాలు;

Update: 2025-02-03 00:15 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారీ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు! ముందునుంచీ హెచ్చరిస్తున్నట్టుగానే తమ పొరుగుదేశాలైన మెక్సికో, కెనడాలతోపాటు చైనాపైనా సుంకాల కొరడా ఝళిపించారు. దీర్ఘకాలిక మిత్రదేశాలైన కెనడా, మెక్సికోల నుంచి తాము దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25% చొప్పున, చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తూ తాజాగా కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.

అమెరికాలోకి ఫెంటానిల్‌ అక్రమ రవాణాను, అక్రమ వలసలను అడ్డుకునేందుకే తాను ఈ చర్యకు ఉపక్రమించినట్లు ప్రకటించారు. మెక్సికో, కెనడా, చైనా.. అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాలు కావడం గమనార్హం. తాజా పరిణామంతో ఉలిక్కిపడ్డ మెక్సికో, కెనడా.. ప్రతీకార చర్యలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అమెరికా ఉత్పత్తులపై తామూ 25% సుంకం విధించనున్నట్లు కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో ప్రకటించారు. వాషింగ్టన్‌పై ప్రతీకార సుంకాలు విధించేందుకు సిద్ధమని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌ ఉద్ఘాటించారు. అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో ఫిర్యాదు చేస్తామని చైనా తెలిపింది. ట్రంప్‌ తాజా చర్యతో అక్రమ వలసలు, ఫెంటానిల్‌ రవాణా కట్టడయ్యే అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయన్న సంగతి పక్కనపెడితే.. ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చే ముప్పు మాత్రం అధికంగా పొంచి ఉందని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిత్యావసరాల ధరలు మరింత పెరిగి, అమెరికన్లకు కష్టాలు రెట్టింపవ్వొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా చర్యకు ఇతర దేశాలూ దీటుగా స్పందిస్తే.. ఈ వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలు చూపే ముప్పుందని అంచనా వేస్తున్నారు. 

సుంకాలు తగ్గించిన భారత్‌

కెనడా, మెక్సికోతో పాటు భారత్‌ దిగుమతులపై కూడా సుంకాలు విధిస్తామని ట్రంప్‌ హెచ్చరించిన క్రమంలో అమెరికా నుంచి దిగుమతయ్యే హైఎండ్‌ బైక్‌లు, కార్లు, స్మార్ట్‌ఫోన్‌ విడి భాగాలపై కస్టమ్స్‌ డ్యూటీని గణనీయంగా తగ్గిస్తున్నట్టు భారత్‌ శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రకటించింది. ఈ చర్యతో అమెరికాకు చెందిన హార్లీ-డేవిడ్‌సన్‌, టెస్లా, ఆపిల్‌ కంపెనీలకు లబ్ధి చేకూరుతుంది. బైక్‌లు, ఫోన్లపై 10 నుంచి 40 శాతం, టెస్లా కార్లపై 55 శాతం వరకు కస్టమ్స్‌ డ్యూటీ తగ్గిస్తున్నట్టు మంత్రి సీతారామన్‌ తెలిపారు.

Tags:    

Similar News