Mahanadu: 'చేతకాని దద్దమ్మ పాలన వల్ల ఏపీ పరువు పోయింది'.. మహానాడులో చంద్రబాబు

Mahanadu: చేతకాని దద్దమ్మ పాలన వల్ల ఏపీ పరువు పోయింది.. మహానాడులో చంద్రబాబు
Mahanadu: ఒంగోలు వేదికగా మహానాడు ఘనంగా ప్రారంభమైంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మండువవారిపాలెం ప్రాంగణం కిటకిటలాడింది.

Mahanadu: ఒంగోలు వేదికగా మహానాడు ఘనంగా ప్రారంభమైంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మండువవారిపాలెంలోని ప్రాంగణం కిటకిటలాడింది. ఎటూ చూసినా పసుపుదనంతో కళకళలాడింది మహానాడు వేదిక. తొలిరోజు కార్యక్రమంలో భాగంగా ఫోటో ఎగ్జిబిషన్‌, రక్తదాన శిబిరాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించి.. పార్టీ జెండా ఆవిష్కరించారు.

ఇటీవ‌లి కాలంలో మ‌ర‌ణించిన పార్టీ నేత‌లు, కార్యక‌ర్తల‌కు సంతాపం తెలిపారు. మహానాడులో తొలిరోజు.. మొత్తం 17 తీర్మానాలు పెట్టారు. ఏపీకి 12, తెలంగాణకు 3 తీర్మానాలు, అండమాన్‌కు ఒక తీర్మానం, మరొకటి రాజకీయ తీర్మానం పెట్టారు. ఈ వేదిక నుంచి అధినేత చంద్రబాబు.. జగన్‌ సర్కారు పాలనపై నిప్పులు చెరిగారు. ఏపీలో ఉన్మాది పాలన శాపంగా మారిందన్నారు. చేతకాని దద్దమ్మ పాలన వల్ల ఏపీ పరువు పోయిందన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు.

అమరావతి ఏం పాపం చేసిందని వైసీపీని నిలదీశారు చంద్రబాబు.3 లక్షల కోట్ల సంపద ఆవిరి చేశారన్నారు. తమ హయాంలో పోలవరం 72 శాతం పూర్తి చేశామన్నారు. అసలు.. జగన్‌కు కాఫర్‌ డ్యాం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకేనన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సమర్ధులైన యువతకు టికెట్లు ఇస్తామన్నారు. పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తామని చెప్పారు. తన కుటుంబ సభ్యులకు తాను రుణపడి ఉన్నా లేకున్నా.. కార్యకర్తలకు మాత్రం రుణపడి ఉన్నానన్నారు.

అంతకు ముందు ప్రసంగించిన ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జగన్‌ సర్కారుపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా గెలిచి తీరుతుందన్నారు. 160 స్థానాల్లో గెలిచి చంద్రబాబును సీఎం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బస్సు యాత్రలో వస్తోంది మంత్రులు కాదని, ఆలీబాబా 40 దొంగలున్నారు అచ్చెన్నాయుడు. చంద్రబాబు సీఎం అయ్యాక ఒకే ఒక్క సంతకంతో.. టీడీపీ కార్యకర్తలపై ఉన్న అక్రమ కేసుల్ని ఎత్తివేస్తామన్నారు.

శనివారం ఎన్టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా టీడీపీ నేతలు ఘనంగా నివాళులర్పిస్తారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ప్రారంభిస్తారు. అనంతరం భారీ బహిరంగ సభ ఉంటుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా, వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల‌పై పోరాటాల‌ను ఉధృతం చేయడం, రెండు రాష్ట్రాల్లోనూ పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా విస్తృత చ‌ర్చ జ‌ర‌గింది.

Tags

Read MoreRead Less
Next Story