TDP: వైసీపీ దాడులపై భగ్గుమన్న కూటమి నేతలు

TDP: వైసీపీ దాడులపై భగ్గుమన్న కూటమి నేతలు
వైసీపీ మూకల దాష్టీకానికి పోలీసులు కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం... కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

విశాఖలో వైసీపీ గూండాల దాడిని కుటుంబ తాగాదాలుగా మార్చి నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని కూటమి నేతలు మండిపడ్డారు. వైసీపీ మూకల దాష్టీకానికి పోలీసులు కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కూటమికి ఓటు వేశామని చెప్పడంతోనే... తమపై విచక్షణారహితంగా దాడి చేశారని... బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. విశాఖలోని G.V.M.C 49వ వార్డు పరిధిలోని బర్మా క్యాంప్‌ వద్ద సుంకర ధనలక్ష్మి, ఆమె కుమార్తెలు నూకరత్నం, రమ్య, కుమారుడు మణికంఠపై స్థానిక వైసీపీ నేత అనుచరులు చేసిన దాడి.... రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. భాస్కర్‌, భూలోక్‌, లోకేశ్‌, సాయి అనే వ్యక్తులు తాగిన మత్తులో వచ్చి ఆ కుటుంబంపై దాడి చేసి గాయపరిచారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు, తెలుగుదేశం, జనసేన నాయకులు, మహిళా నేతలు పరామర్శించారు. కూటమికి ఓటు వేశారన్న కక్షతోనే దాడి జరిగిందన్న బాధిత కుటుంబం వైసీపీ శ్రేణుల అరాచకాలను మీడియాకు వివరించింది.


వైసీపీ గూండాలకు పోలీసులు మద్దతిస్తున్నారని... కూటమి నేతలు మండిపడ్డారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని విశాఖ నార్త్‌ కూటమి అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు డిమాండ్‌ చేశారు. వైసీపీ గెలిచాక రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని జనసేన నాయకురాలు ఉషా కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి సందర్భంగా బాధితుల ఇంట్లో పరిస్థితి..., వారి ఆర్తనాదాలు రికార్డయిన వీడియోను బాధిత కుటుంబం, నాయకులు మీడియాకు చూపించారు.

మరోవైపు పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసులు తెలుగుదేశం సానుభూతిపరులను నిర్బంధించి విపరీతంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మాచవరం మండలం మోర్జంపాడుకు చెందిన తెలుగుదేశం కార్యకర్తలు...... ఈ నెల 14న దాచేపల్లికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ పోలీసులు లాఠీలతో విచక్షణరహితంగా కొట్టినట్లు బాధితులు వాపోయారు. బాధితుల్లో అనిల్ అనే ఐటీ ఉద్యోగిని... 2 రోజులపాటు చిత్రహింసలకు గురిచేసి, ఈనెల 16న సత్తెనపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు.పోలీసులు తమను చిత్రహింసలకు గురిచేశారని కోర్టులో బాధితులు విన్నవించుకోగా వారిని గుంటూరు GGHలో వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. బాధితులను ఆసుపత్రికి తీసుకువచ్చిన పోలీసులు. వారికి ఎలాంటి గాయాలు లేవని నివేదిక ఇవ్వాలని వైద్యులపై ఒత్తిడి తెచ్చారు. దీనికి వైద్యులు అంగీకరించలేదు.ఈ అంశం తెలిసి GGHకు మీడియా ప్రతినిధులు చేరుకోగా.. వారిని లోపలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కరుడుగట్టిన వైసీపీ నేతల కంటే పోలీసులు దారుణంగా వ్యవహరించారని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు.

Tags

Next Story