AP: పండగ పూట అంగన్‌వాడీల పస్తులు

AP: పండగ పూట అంగన్‌వాడీల పస్తులు
జగన్‌ విధానాల వల్లే అని అంగన్‌వాడీల ఆందోళన... కొనసాగుతున్న ఆందోళనలు

జగన్‌ ప్రభుత్వ వైఖరితో పండగపూటా పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొందని అంగన్వాడీలు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకుండా చర్చల పేరుతో ప్రభుత్వం డ్రామాలాడుతోందని మండిపడ్డారు. విధుల్లో చేరకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని ప్రభుత్వం చేస్తున్న బెదిరింపులకు నిరసనగా.. ఎస్మా ప్రతులను భోగిమంటల్లో వేసి దహనం చేశారు. పనికి తగ్గ ప్రతిఫలం కోసం పోరాడుతున్న మహిళలపై ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరిస్తోందని అంగన్వాడీలు 33వ రోజు ఆందోళనలతో హోరెత్తించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి బోసు బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోరాటానికి ప్రజా మద్దతు కోరుతూ సంతకాల సేకరణ చేపట్టారు.ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం ఆపేదిలేదని ఒంగోలు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు నిరాహార దీక్ష చేశారు.


కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని దీక్షా శిబిరం నుంచి సోమప్ప కూడలి వరకు కోటి సంతకాల సేకరణ చేపట్టారు. నంద్యాలలో గుమ్మడి కాయలు కొట్టి అంగన్వాడీలు నిరసన తెలిపారు. బద్వేల్‌లో మూడు నామాలు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరుపతి పాత మున్సిపల్‍ కార్యాలయం వద్ద భోగి మంటలు వేసి ఎస్మా జీవో ప్రతులను తగలబెట్టారు. పలమనేరులో అంగన్వాడీలకు మాజీ మంత్రి అమర్నాథ్‌ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. నాయుడుపేట ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట భోగి మంటలు వేసి సమస్యల్ని పరిష్కరించాలని పాటలు పాడారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎస్మా ప్రతులను భోగిమంటలో వేసి దహనం చేశారు. బుక్కరాయసముద్రం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద జగనన్నకు చెబుదామంటూ.. అంగన్వాడీలు కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఉరవకొండలోని హంద్రీనీవా జలాల్లో ఎస్మా జీవో ప్రతులను వదిలి అంగన్వాడీలు నిరసన తెలిపారు.అంగన్వాడీల సమ్మెకు సీపీఐ నేత రామకృష్ణ మద్దతు తెలిపారు. మేలో ఇంటికి వెళ్లే ముఖ్యమంత్రి.. జూలైలో అంగన్వాడీల వేతనాలు ఎలా పెంచుతారని దుయ్యబట్టారు.


సమస్యలు పరిష్కరించాలని నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం కనికరం చూపడంలేదని అనకాపల్లిలో అంగన్వాడీలు భోగి మంటల్లో ఎస్మా ప్రతులను వేసి దహనం చేశారు. జగన్‌ ప్రభుత్వ మొండి వైఖరితో పండగపూట పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొందని మామిడి కుదురు, రాజోలు ప్రాంతాల్లో అంగన్వాడీలు నిరసన తెలిపారు. మాట ఇచ్చిన సీఎం.. కనీస వేతనం ఇవ్వాలని విశాఖలో ఆందోళనల్ని ఉద్ధృతం చేశారు. సంక్రాంతిని జీవితంలో గుర్తిండిపోయేలా చేసిన జగన్‌ ను మర్చిపోమంటూ హెచ్చరించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జీవో ప్రతులను భోగి మంటల్లో దహనం చేసి అంగన్వాడీలు నిరసన తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story