AP: పట్టు సడలని అంగన్‌వాడీల సంకల్పం

AP: పట్టు సడలని అంగన్‌వాడీల సంకల్పం
ప్రభుత్వం బెదిరించినా 20 రోజులుగా ఆందోళన... న్యూ ఇయర్‌ వేడుకలకు దూరం

ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ 20 రోజులైనా పట్టు సడలని సంకల్పంతో అంగన్వాడీలో ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వం బెదిరించినా జీతాలు పెంచలేమని తెగేసి చెప్పినా వెక్కితగ్గకుండా ఉద్యమం చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు రోజురోజుకూ.... ఆందోళనల్లో వేడి పెంచుతూ పోరు సాగిస్తున్నారు. కొత్త సంవత్సర వేడుకలకూ దూరంగా ఉంటూ రోడ్డెక్కి వివిధ రూపాల్లో గొంతెత్తుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీలు, వర్కర్లు ఉద్ధృతంగా నిరసన చేస్తున్నారు. 19వ రోజు నిరసనలో భాగంగా బాపట్లలో అంగన్వాడీలు ఐసీడీఎస్ కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ ప్రదర్శన చేసి మానవహారం నిర్వహించారు. కనీస వేతనం, గ్రాట్యూటీ తదితర డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీలు స్పష్టం చేశారు.


కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ప్రధాన రహదారిపై క్రికెట్‌ ఆడుతూ అంగన్వాడీలు నిరసన తెలిపారు. మానవహారంగా నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాకినాడ జిల్లా తునిలో 20 రోజులుగా... అంగన్వాడీ కార్యకర్తలు నిరసన దీక్షలు చేస్తున్నారు. కనీసవేతనం 26వేలు ఇవ్వాలంటూ.. డిమాండ్‌ చేశారు. తమ ఇబ్బందులు, సమస్యలపై పాటలు పడుతూ ధర్నా చేపట్టారు. విజయవాడ ధర్నా చౌక్‌లో అంగన్వాడీలు ఆందోళన చేశారు. ధర్నాలో పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొని... సమస్యలపై గళమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే వరకు నిరసనలు ఆగవని స్పష్టం చేశారు. ఒంగోలులోనూ అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.


కనీస వేతనం సహా ఇతర డిమాండ్లపై ఉద్యమించిన అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు.... నెల్లూరు జిల్లా ఆత్మకూరులో.... 20 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు. దున్నపోతుకు వినతిపత్రం అందజేసి... ప్రభుత్వంపై తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. డిమాండ్లు నెరవేర్చకుంటే ప్రభుత్వంతో ఇంతకైనా పోరాడుతామని..... కర్నూలులో అంగన్వాడీలు హెచ్చరించారు. 20 రోజులుగా మహిళలు రోడ్డు ఎక్కి ధర్నా చేస్తుంటే... సీఎం స్పందించ కపోవడం దారుణమని మండిపడ్డారు. YSR జిల్లా మైదుకూరులో ఆటాపాటలతో నిరసన తెలిపారు. డిమాండ్లతో కూడిన నినాదాలను కూతగా వినిపించి కబడ్డీ ఆడారు.

డిమాండ్లు పరిష్కారించాలని అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 20వ రోజుకు చేరుకుంది. కాకినాడ జిల్లా తునిలో తమ ఇబ్బందులు, సమస్యలపై పాటలు పాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు నిరసన గళం విప్పారు. సీఎం జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. 10 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ లో వెళ్లే జగన్ కు అంగన్వాడీల గోడు వినిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story