AP: పండుగ రోజు పోరాటమే

AP: పండుగ రోజు పోరాటమే
జగన్‌ ప్రభుత్వం తమను రోడ్డున పడేసిందన్న అంగన్‌వాడీలు.... 35వరోజూ కొనసాగిన ఆందోళనలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలంతా ఇంటిల్లిపాది ఘనంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటుంటే జగన్‌ ప్రభుత్వం తమను రోడ్డున పడేసిందని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ కోట్లు ఖర్చు చేసి సెట్టింగులు వేసి పండుగ జరుపుకుంటే తాము మాత్రం... భర్త, పిల్లల్ని వదిలేసి రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితి తలెత్తిందని వాపోయారు. కనీస వేతనం, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని పండుగ రోజూ వినూత్న నిరసనలతో హోరెత్తించారు. డిమాండ్లు పరిష్కరించాలని అంగన్వాడీలు 35వ రోజూ ఆందోళనలు కొనసాగించారు.


సంక్రాంతి పండుగ రోజు పంచభక్ష పరమాన్నాలు తీనాల్సింది పోయి.. జగన్‌ ప్రభుత్వ మొండి వైఖరితో రోడ్డు పాలయ్యామని కర్నూలులో అంగన్వాడీలు ఆందోళన చేశారు. ఎమ్మిగనూరులో రహదారిపై ముగ్గులు వేసి సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని దీక్షా శిబిరం వద్ద పొయ్యి వెలిగించి సజ్జ రొట్టెలు చేసుకుని నిరసన తెలిపారు. పండగ వేళ సీఎం జగన్‌ ఇంట్లో వెలుగులు ఉంటే.. తమ బతుకుల్లో చీకట్లే మిగిలియాని వాపోయారు. నంద్యాల తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు మట్టి తింటూ నిరసన తెలిపారు. నెల్లూరులో అంగన్వాడీలు తమ ఆవేదనను ముగ్గుల్లో వేసి నిరసన తెలిపారు. పండుగ పూట కుటుంబంతో సరదాగా గడపాల్సిందిపోయి.. ఇలా రోడ్డెక్కెల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చాలని 35రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద అంగన్వాడీలు ఆందోళన చేశారు.


అంగన్వాడీల సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించకపోగా.. ఎస్మా ప్రయోగించి బెదిరిస్తోందని గుంటూరులో అంగన్వాడీలు ఆందోళన చేశారు. కళ్ల గంతలు ఆటలు ఆడుతూ నిరసన తెలిపారు. మంగళగిరిలో అంబేద్కర్‌ కూడలిలో ముగ్గులు వేసి, పొంగళి చేసి ఆందోళన వ్యక్తం చేశారు. తమ గోడు పట్టని ప్రభుత్నాన్ని వచ్చే ఎన్నికల్లో రోడ్డున పడేస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ RDOకార్యాలయం వద్ద అంగన్వాడీలు పొంగలి తయారు చేసి నిరసన తెలిపారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద ముగ్గులు వేసి, కోలాటాలు ఆడుతూ అంగన్వాడీలు ఆందోళన చేశారు. వారికి తెలుగుదేశం నేత మాగంటి బాబు సంఘీభావం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో అంగన్వాడీలు రంగవల్లులు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్‌ సర్కార్‌ తమ గోడు ఆలకించి, సమస్యల్ని పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story