AP: సంక్రాంతి వేళ అంగన్‌వాడీల ఆందోళన

AP: సంక్రాంతి వేళ అంగన్‌వాడీల ఆందోళన
భోగి మంటల్లో జగన్‌ ప్రభుత్వ జీవోలు....దీక్షా శిభిరాల వద్దే పండుగ..

సంక్రాంతి వచ్చినా.. అంగన్వాడీల సమ్మెకు విరామం లేదు. పండుగను... దీక్షా శిభిరాల వద్దనే జరుపుకున్నారు. 34రోజులుగా రోడ్డెక్కిన అంగన్వాడీలు.. తమలో రగులుతున్న నిరసననాగ్నిని భోగి మంటలు వేసి ప్రకటించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రతులను ఆ మంటల్లో వేసి దగ్ధం చేశారు. Y.S.R.జిల్లా మైదుకూరు, జమ్మలమడుగులో భోగి మంటలు వేసిన అంగన్వాడీలు ఎస్మా, G.O. నంబర్‌ రెండు ప్రతులను తగలబెట్టారు. కడపలోని అంగన్వాడీ దీక్షా శిబిరం వద్ద మాట తప్పిన జగన్‌... బైబై జగన్‌ అన్నా అని ముగ్గు వేశారు. అనంతపురంలో అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌ ఎదుట భోగి మంటలు వేసి నిరసన తెలిపారు.


అనంతపురం జిల్లా ఉరవకొండలో హంద్రీనీవా కాలువలో ఎస్మా జీవో ప్రతులను కృష్ణా జలాలలోకి వదిలి నిరసన తెలిపారు. గోడు కనపడ లేదా.....వినపడలేదా అంటూ నినాదాలు చేశారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బుక్కరాయసముద్రం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ప్రభుత్వం వెంటనే ఎస్మాను ఉపసంహరించుకోవాలని కర్నూలులో అంగన్వాడీలు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పండుగ రోజూ.. అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ చేశారు. డిమాండ్లు నెరవేర్చాలని ... 34 రోజులుగా సమ్మె చేస్తున్నా న్యాయం చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో భోగి మంటలు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నృత్యాలు చేశారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు భోగి మంటలు వేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్మా జీవో ప్రతులను మంటల్లో వేసి దహనం చేశారు.


శ్రీకాకుళంలో అంగన్వాడీలు... దీక్షా శిబిరం వద్ద భోగి మంటలు వేసి ఎస్మా చట్టం ప్రతులను దగ్ధం చేశారు. భోగి పండుగను కుటుంబసభ్యులతో కలసి అక్కడే జరుపుకున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం I.C.D.S. కార్యలయం ఎదుట భోగి మంటల్లో జీ.వో. నంబర్‌ రెండు ప్రతులను దగ్ధం చేశారు. విజయవాడ ధర్నాచౌక్ లో 34వ రోజు అంగన్వాడీలు నిరవధిక సమ్మె కొనసాగించారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన షోకాజ్‌ నోటీసులను గుంటూరులో అంగన్వాడీలు భోగి మంటల్లో వేసి కాల్చారు. N.T.R. జిల్లా నందిగామ R.D.O. కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు... ముగ్గులు వేసి రంగవల్లులు అద్దారు.

తిరుపతి పాత మున్సిపల్‍ కార్యాలయం వద్ద ముందుగానే భోగి మంటలు వేసి ఎస్మా జీవో ప్రతులను అంగన్వాడీలు తగలబెట్టారు. ఆడవారి ఆకలి మంటలు అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెల్లూరులో అంగన్వాడీలకు మద్దతుగా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ర్యాలీ నిర్వహించాయి.

Tags

Read MoreRead Less
Next Story