AP: కదం తొక్కుతున్న అంగన్వాడీలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బెదిరింపులకు అంగన్‌వాడీలు ఏమాత్రం తలొగ్గడం లేదు. ఎస్మా ప్రయోగించినా వెనకడుగు వేయకుండా పోరాటం కొనసాగిస్తున్నారు. పోలీసులతో ఈడ్చిపడేస్తున్నా.. బెదరకుండా ఆందోళనలు చేస్తున్నారు. 31 రోజులుగా కాళికామాతలై కదం తొక్కుతున్నారు. నిత్యం ధర్నాలు, నిరసనలతో ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. డిమాండ్లు సాధించే వరకు సమ్మె ఆగదని తేల్చిచెబుతున్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనలు 31వ రోజూ కొనసాగాయి. ప్రభుత్వం తమపై ఎంత మొండిగా వ్యవహరించినా నిరసన కార్యక్రమాలు ఆపేది లేదని అంగన్వాడీలు తేల్చి చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం దీక్షా శిబిరంలో... అంగన్వాడీలు చిన్నారులకు పుట్టినరోజు వేడుకలు, అన్నప్రాసన, పౌష్ఠికాహారం అందించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని విజయవాడలో అంగన్వాడీలు హెచ్చరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో అంగన్వాడి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. తెనాలిలో అంగన్వాడీలు కుర్చీలు నెత్తిన పెట్టుకుని నిరసన తెలిపారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి రాష్ట్ర బందుకు పిలుపునిస్తామని కర్నూలులో వామపక్ష నాయకులు హెచ్చరించారు.
కడపలో అంగన్వాడీలు చప్పట్లు కొడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. Y.S.R. జిల్లా బద్వేలులో అంగన్వాడీ కార్యకర్తలు మెడకు ఉరితాడు వేసుకొని నిరసన చేపట్టారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని దీక్షా శిబిరం వద్ద అంగన్వాడీలు అర్ధరాత్రి వేళ ఆటలాడుతూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ నిరసన తెలిపారు. జగన్ చిత్రపటం ముందు దీపాలు వెలిగించి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కనీస వేతనం మా హక్కంటూ శింగనమలలో అంగన్వాడీలు నినదించారు.
సమస్యల పరిష్కారం కోసం విజయనగరం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు నిరాహార దీక్ష చేపట్టారు. 31 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో నిరసనకు దిగిన అంగన్వాడీలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు. అంగన్వాడీ సమస్యలపై సీఎం దృష్టి పెట్టకపోవడం దారుణమని మండిపడ్డారు. కోనసీమ జిల్లా పి.గన్నవరంలో అంగన్వాడీలు జలదీక్ష చేపట్టారు. గోదావరి నదిలోకి దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టిన అంగన్వాడీలు... ఎస్మా ప్రయోగించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. YSR జిల్లా కమలాపురంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఆందోళన చేశారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద కుర్చీలు నెత్తిన పెట్టుకొని అంగన్వాడీలు వినూత్నంగా నిరసన తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com