AP: వెనక్కి తగ్గని అంగన్వాడీలు

ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీలు ఆందోళనలను మరింత ఉద్ధృతం చేశారు. 41 రోజులుగా రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆరోపిస్తూ జగనన్నకు చెబుదాం పేరుతో చలో విజయవాడకు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పుకునేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరికాదని అంగన్వాడీలు మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా...విజయవాడ చేరుకుని తీరుతామని అంగన్వాడీలు స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు అంగన్వాడీలు సిద్ధమయ్యారు. శాంతియుత నిరసనలతో సమస్యలు పరిష్కారం కావడం లేదని హామీలిచ్చిన ముఖ్యమంత్రికే తమ గోడు వినిపించేందుకు చలో విజయవాడకు పిలుపునిచ్చారు.
జగనన్నకు చెబుదాం పేరిట పెద్దఎత్తున విజయవాడకు బయలుదేరిన అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. సమ్మెలో భాగంగా చేపట్టిన కోటి సంతకాల ప్రతులను నేరుగా సీఎంకు అందజేసేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడంపై అంగన్వాడీలు మండిపడ్డారు. Y.S.R జిల్లా మైదుకూరు నుంచి విజయవాడకు కారులో తరలివెళ్తున్న కార్యకర్తలను బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని మైదుకూరు డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. కర్నూల్లో దీక్షా శిబిరంలోని కార్యకర్తలను ఖాకీలు ముందస్తుగా అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆంగన్వాడీలు స్టేషన్‌లో ఆందోళన చేపట్టారు. నంద్యాల రైల్వేస్టేషన్‌లో అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట నుంచి విజయవాడ వస్తున్న అంగన్వాడీలను పశ్చిమగోదావరి జిల్లా చించినాడ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సొంతపూచికత్తుపై ఆ తర్వాత విడుదల చేశారు.
విశాఖ జిల్లా పెందుర్తిలో అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో పోలీసుస్టేషన్ ఎదుట అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. విజయనగరం జిల్లా కురుపాం మండలానికి కార్యకర్తలను విజయనగరం రైల్వేస్టేషన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కార్యకర్తలు ప్లాప్‌ఫామ్‌పైనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడ ధర్నాచౌక్‌లో ఆమరణ నిరాహారదీక్షకు దిగిన కార్యకర్తల్లో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com