AP: తగ్గేదే లే అంటున్న అంగన్‌వాడీలు

AP: తగ్గేదే లే అంటున్న అంగన్‌వాడీలు
ఎస్మా ప్రయోగించినా వెనక్కి తగ్గని నిరసనలు... 28వ రోజు ఉవ్వెత్తున్న ఎగిసిన ఆందోళనలు

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్న ప్రభుత్వ హెచ్చరికలను అంగన్వాడీలు భేఖాతరు చేశారు. ఎస్మా ప్రయోగిస్తామని బెదిరించినా లెక్కచేయలేదు. 28 వ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగించారు. కనీస వేతనం పెంపు సహా డిమాండ్లు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే...రానున్న ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెబుతామని అంగన్వాడీలు హెచ్చరించారు. అంగన్వాడీలు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ప్రభుత్వం రెచ్చగొట్టే ధోరణి అవలంభిస్తోందని అంగన్వాడీ కార్యకర్తలు మండిపడ్డారు.


ప్రభుత్వ ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని నిరసిస్తూ NTR జి‌ల్లా నందిగామలో అంగన్వాడీలు గుంజీలు తీసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా...ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు తెలుగుదేశం నేత బూరగడ్డ వేదవ్యాస్‌ మద్దతు తెలిపారు. అంగన్వాడీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే ఎస్మాను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వీరికి కాంగ్రెస్ నేతలు మద్దతు పలికారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహం ఎదుట మానవహారం నిర్వహించారు. అనంతరం ఎస్మా జీవో పత్రాలను తగులబెట్టారు.

ప్రభుత్వం ఎస్మా పేరిట భయపెట్టినా భయపడేది లేదని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. కర్నూలులో అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. శ్రీకృష్ణదేవరాయల కూడలి వద్ద దీక్షా శిబిరంలో అంగన్వాడీలు ఉరివేసుకుని నిరసన తెలిపారు. నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష కొనసాగించారు. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడితే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని అంగన్వాడీలు హెచ్చరించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో పోర్లు దండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. YSR జిల్లా జమ్మలమడుగులో చేతులకు బేడీలు వేసుకున్నట్లు వస్త్రాలతో కట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


ఏలూరు కలెక్టరేట్ వద్ద రోడ్డుపై భైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీలు నినాదాలు చేశారు. తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తే..సీఎం జగన్‌ ఉద్యోగం ఊడగొడతామని హెచ్చరించారు. విశాఖ GVMC వద్ద అంగన్వాడీల ఆందోళన కొనసాగించారు. మరోవైపు డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టిన పారిశుద్ధ్య కార్మికులు..ప్రభుత్వ అణచివేత ధోరణిని నిరసిస్తూ...ఉద్యమం ఉద్ధృతంగా కొనసాగిస్తున్నారు. కలెక్టరేట్ల ముట్టడికి యత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హామీలు నెరవేర్చాలంటూ రోడ్డెక్కిన మున్సిపల్‌ కార్మికులు సడలని సంకల్పంతో సమ్మెను కొనసాగిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story