CBN: ఇసుక, మద్యంలో తలదూర్చొద్దు

ప్రజాస్వామ్యంలో జగన్ లాంటి వ్యక్తులు వస్తారని ఊహించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టీడీపీ సభ్యత్వ నమోదును ప్రారంభించిన చంద్రబాబు... జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ముఖ్యనేతకైనా మూలాలు టీడీపీలోనే ఉన్నాయని తెలిపారు. ఇసుక, మద్యంలో ఎవరూ తలదూర్చొద్దని... టీడీపీ శ్రేణులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. తెలుగుదేశంపార్టీ ఆవిర్భావంతోనే తెలుగుజాతికి గుర్తింపు వచ్చిందని, టీడీపీ ఒక రాజకీయ యూనివర్సిటీ అని చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతల దాడిలో ప్రాణాలు కోల్పోయిన, దాడులకు గురైన, ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలతో ఆయన జూమ్‌కాల్ ద్వారా మాట్లాడారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. అనేక సమస్యలు, సవాళ్లు, ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, టీడీపీని నిలబెట్టామన్నారు. 2024 ఎన్నికల్లో గెలుపు కార్యకర్తల విజయమే అని తేల్చి చెప్పారు. వేధింపులు, కేసులు, అరెస్టులు, దాడులతో నాటి పాలకులు ఇబ్బందులు పెట్టినా, ఏ కార్యకర్తా వెనక్కి తగ్గలేదన్నారు. ఎవరూ జెండా వదల్లేదు. చాలామంది ప్రాణాలు, ఆస్తులు సైతం కోల్పోయారని అన్నారు.
రూ. 10 లక్షల కోట్ల అప్పు
జగన్ చేసిన విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్‌ను గాడిలో పెడుతూ రూ. 10 లక్షల కోట్లకు పైగా అప్పు భారం మోస్తున్నామనే విషయాన్ని గ్రహించాలని సీఎం పేర్కొన్నారు. మనం ఓ విషవలయంలో ఉన్నామని గుర్తించాలని, దీన్ని పరిష్కరించేందుకు కొంత సమయం అవసరమని తెలిపారు. ఇప్పటికే చాలా వ్యవస్థలను గాడిలో పెట్టామన్నారు. గత ఎలక్షన్స్‌ను ఎన్నికలు అనేకంటే రాక్షసుడితో యుద్దం అనాలో, మరేం అనాలో తెలియట్లేదన్నారు. నష్టపోయిన కార్యకర్తలను ఆదుకుంటూనే, ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలని చంద్రబాబు స్పష్టంచేశారు.
తొందరపడొద్దు..
గత ప్రభుత్వం కక్షపూరితంగా పెట్టిన తప్పుడు కేసులకు చట్ట పద్ధతిలోనే పరిష్కారం చూపిస్తానని, ఎవ్వరూ తొందరపడొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. ఎక్కువ అంచనాలు పెట్టేసుకుని ఎవ్వరూ నిరుత్సాహపడొద్దని ఆయన కోరారు. రాజకీయాల్లో ఎన్ని మార్పులు, సంస్కరణలు వచ్చినా, మూల సిద్దాంతం ప్రజాసేవని మరవద్దని చంద్రబాబు హితవుపలికారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పాలసీని తెచ్చి.. సీనరేజ్, లోడింగ్ చార్జీలను రద్దు చేశామని చంద్రబాబు తెలిపారు. వైసీపీ నేతలు రూ.30కే ఇసుక తోడుతామని టెండర్లు వేశారని, ఇసుక పాలసీపై తప్పుడు సంకేతాలు పంపాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఇసుక విషయంలో ఎవరు దందా చేసినా తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో మనవాళ్లు తప్పు చేసినా ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com