PAWAN: వైసీపీ విపత్తు నుంచి ప్రజలను కాపాడాం

విజయవాడలో జరిగిన NDRF రైజింగ్ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.' విపత్తులు ప్రకృతిలోనే కాదు... మనుషుల్లోనూ వస్తాయి. గత ప్రభుత్వం మళ్లీ వస్తే విపత్తు ఎలా ఉండేదో? వైసీపీ ప్రభుత్వంలో ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. గత సర్కార్ లో వచ్చిన రాజకీయ విపత్తు నుంచి ఏపీని కూటమి గట్టెక్కించింది' అని పవన్ అన్నారు. 2024 ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో గత ప్రభుత్వం మళ్లీ వచ్చి ఉంటే మరింత విధ్వంసం జరిగేదని.. పవన్‌కల్యాణ్ వెల్లడించారు. ఎన్డీయేగా తామంతా కలిసి పోరాడి.. గత ప్రభుత్వం అనే విపత్తు నుంచి ప్రజలను కాపాడగలిగామని తెలిపారు. ప్రధాని మోఢీ నేతృత్వంలో హోంమంత్రి అమిత్‌షా సూచనలతో చంద్రబాబు నాయకత్వంలో పనిచేసి ఏపీలో మరోసారి మానవ నిర్మిత విపత్తు పాలన రాకుండా కాపాడాం. ఇప్పుడు ఎన్‌ఐడీఎం, ఎన్‌డీఆర్‌ఎఫ్ సంస్థలు ప్రారంభం కావడానికి అదే దోహదపడిందని పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు.
విపత్తుల నిర్వహణ అందరి బాధ్యత
విపత్తుల నిర్వహణ ఎన్‌డీఆర్‌ఎఫ్ పని మాత్రమే కాదని... ఇది అందరి బాధ్యతని పవన్ వెల్లడించారు. పంచాయతీ స్థాయిలోనూ విపత్తు నిర్వహణపై ప్రజలకు ముందస్తు అవగాహన ఉండాలని అమిత్‌షా సూచించారు. ప్రతి పంచాయతీ పరిధిలో విపత్తు నిర్వహణ బృందాలను తయారుచేస్తామని... వారికి ఎన్‌డీఆర్‌ఎఫ్ ప్రతినిధులతో శిక్షణ ఇప్పిస్తామని పవన్ తెలిపారు. విపత్తుల వేళ ఎన్‌డీఆర్‌ఎఫ్ సహకారంతో భారీ నష్టం జరగకుండా అధిగమించొచ్చని అన్నారు.
వైసీపీ ఐదేళ్ల పాలన ఘోర విపత్తు
ప్రకృతి విపత్తులొచ్చినప్పుడు NDRF రక్షిస్తే.. మానవ ప్రేరేపిత విపత్తుల నుంచి NDA రక్షిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అయిదు సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వ పాలనలో అలాంటి విపత్తే సంభవించిందని.. ఆ విపత్తు నుంచి ఏపీని బయట పడేసేందుకు చంద్రబాబు- మోడీ జోడీ కృషి చేస్తోందని అమిత్ షా తెలిపారు. విజయవాడ సమీపంలోజాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ దక్షిణాది క్యాంపస్, ఎన్డీఆర్‌ఎఫ్ పదో బెటాలియన్ భవనాల ప్రారంభం, 20వ వ్యవస్థాపక దినోత్సవాల్లో కేంద్ హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. తిరుపతిలోని రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన రెండు భవనాలను విజయవాడ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com