AP: ఏపీ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

AP: ఏపీ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
ఏజెంట్ల నియామకంపై కీలక ఆదేశాలు.... 4 ,44, 216 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలయ్యాయన్న ముకేశ్‌ కుమార్ మీనా

పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల నియామక జాబితాను రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. పోలింగ్ తేదీ రోజు ప్రిసైడింగ్ అధికారికి వివరాలు సమర్పిస్తే సరిపోతుందని ఈసీ తెలిపింది. పోలింగ్ ఏజెంట్లను, అభ్యర్థి సర్టిపై చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రొసైడింగ్ ఆఫీసర్ సమక్షంలో పోలింగ్ ఏజెంట్ల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని ఈసీ స్పష్టతనిచ్చింది.

4 ,44, 216 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 4 లక్షల 44 వేల 216 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకున్నారని..... రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్ మీనా స్పష్టంచేశారు. ఈ నెల 4 తేదీ నుంచి 9 తేదీ వరకూ 6 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగిందన్నారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో అత్యధికంగా 22వేల650 పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ , అత్యల్పంగా అమలాపురం పార్లమెంటు పరిధిలో 14 వేల 526 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయన్నారు. పోలైన పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్నామని …...మీనా పేర్కొన్నారు. డీబీటీ పథకాలకు నిధుల విడుదలపై సీఎస్ వివరణ ఇచ్చారని తెలిపారు. 14 నియోజకవర్గాల్లో వందశాతం వెబ్ క్యాస్టింగ్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు సహా ఇంకొన్ని చోట్ల వెబ్ క్యాస్టింగ్ చేసేందుకు ఆయా జిల్లాల అధికారులు నిర్ణయించారని వివరించారు. అన్ని సౌకర్యాలతో ఉండేలా ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో 28 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పల్నాడు సహా అన్ని సున్నితమైన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల్లో రెండేసి చొప్పున సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు మీనా స్పష్టంచేశారు.


కీలక ఆదేశాలు

ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 13న జరుగనున్న ఎన్నికలను ప్రశాంతంగా, న్యాయంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వ్యూహాత్మకంగా, పటిష్టమైన చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల డీఈవో‎లను, ఎస్పీలను ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలసి ఎన్నికల నిర్వహణకు 72 గంటల ముందు చేయాల్సిన ఏర్పాట్లు, బందోబస్తు విస్తరణ అంశాలను సమీక్షించారు. 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు చివరి ఘట్టం ఆసన్నమైందన్నారు. రానున్న మూడు రోజులు ఎంతో కీలకమైనవని, అన్ని జిల్లాల ఎన్నికల యంత్రాంగం ఎంతో అప్రమ్తతంగా ఉంటూ ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా చూడాలన్నారు. ఓటర్లను ప్రలోభపర్చే కార్యక్రమాలకు తావులేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలింగ్ డే కి ముందు ఇదే చివరి వీడియో కాన్ఫరెన్స్ అని, ఏమన్నా అపరిష్కృత అంశాలు ఉంటే వెంటనే తమ దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.

Tags

Next Story