AP: పోలవరంపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ

AP: పోలవరంపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ
X
ఒకే సీజన్ లో పనులు పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నామని వెల్లడి.. రూ. 7,200 కోట్లు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వం

పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణానికి రూ.7,200 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. నవంబర్ నుంచి పనులు ప్రారంభించి ఒకే సీజన్‌లో పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ లేఖలో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరిలో ఆ నిధులను విడుదల చేస్తే పోలవరం హెడ్ వర్క్స్ పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేస్తామని పేర్కొంది.

పాత పద్ధతిలోనే డయాఫ్రం వాల్

పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం గ్యాప్‌–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు ఎగువన సమాంతరంగా కొత్తగా పాత పద్ధతిలోనే డయాఫ్రం వాల్‌ నిర్మించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘానికి అంతర్జాతీయ నిపుణుల కమిటీ మరోసారి స్పష్టం చేసింది. పాత డయాఫ్రం వాల్‌ను 15 నెలల్లో నిర్మించారని గుర్తు చేస్తూ.. కొత్త డయాఫ్రం వాల్‌ను ఈ ఏడాది నవంబర్‌ నుంచి 2025 జూలైలోగా పూర్తి చేయాలని పేర్కొంది. ఒకే సీజన్‌లో ఆ పనులు చేసేందుకు అదనంగా గ్రాబర్లు, కట్టర్లు, అనుబంధ యంత్ర పరికరాలు, నిపుణులైన సిబ్బందిని సమకూర్చుకోవాలని సూచించింది. డయాఫ్రం వాల్‌ డిజైన్, నిర్మాణంపై చర్చించేందుకు తక్షణమే వర్క్‌ షాప్‌ నిర్వహించాలని పేర్కొంది. ఈ మేరకు సీడబ్ల్యూసీ, పీపీఏలకు ఈనెల 20న అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది.

చంద్రబాబు ఆరోపణలు

పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారని.. వైఎస్ జగన్ రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తి అని చంద్రబాబు గతంలో ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ విధానం చేపట్టారని.. ఏజెన్సీని కూడా మార్చారని అన్నారు. అస్తవ్యస్త పనులతో కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయిందని ఆరోపించారు. పోలవరం ప్రజల ప్రాజెక్టు అని.. త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.అంతకుముందు పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన చంద్రబాబు నాయుడు.. స్పిల్‍వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించారు. బస్సులో తిరుగుతూ ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు.

సీమకూ నిధులివ్వండి

అమరావతి, పోలవరం అభివృద్ధి మాత్రమే కాకుండా రాయలసీమ అభివృద్ధికి కేంద్రంతో నిధులు సాధించాలని సీఎం చంద్రబాబునాయుడును రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం రాయలసీమ విద్యావంతుల వేదిక నాల్గో రాష్ట్ర మహాసభలు వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు పురపాలక అనిబిసెంట్‌ ఉన్నత పాఠశాల ఆవరణంలోని మహిళా స్వశక్తి భవనంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 44 శాతం భూములకు నీటి ప్రాజెక్టులు ఉంటే రాయలసీమలో కేవలం తొమ్మిది శాతం భూములకు మాత్రమే కట్టారన్నారు. చంద్రబాబుకు అమరావతిపై ఉన్న పట్టుదల సీమ పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ఉండాలన్నారు.

Tags

Next Story