AP: ఓటాన్‌ ఆకౌంట్‌ బడ్జెట్‌పై ఆర్డినెన్స్‌ జారీ

AP: ఓటాన్‌ ఆకౌంట్‌ బడ్జెట్‌పై ఆర్డినెన్స్‌ జారీ
నేటితో ముగియనున్న గత ప్రభుత్వం జారీ చేసిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ కాలపరిమితి

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆన్ లైన్లో మంత్రుల నుంచి ఆర్డినెన్సుకు సర్కార్ ఆమోదం తీసుకుంది. ఇప్పటికే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సును గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్టుకు కాలపరిమితి ఇవాళ్టీతో ముగియనున్న నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్సు జారీ చేసింది. నాలుగు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సుకు ఆమోదం తీసుకున్న కూటమి ప్రభుత్వం.. సుమారు రూ. 1.30 లక్షల కోట్ల మేర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సుకు ఆదేశాలు ఇచ్చింది. 40 విభాగాలకు చెందిన డిమాండ్లు, గ్రాంట్లకు ఆమోదం వచ్చేలా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు జీవో జారీ చేసింది.

అన్న క్యాంటీన్ల నిర్మాణం, రోడ్ల రిపేర్లు సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్ లో కేటాయింపులు చేయనున్నారు. రోడ్ల మరమ్మతులకు రూ. 1100 కోట్ల మేర ఖర్చు అవుతుందని అధికారుల అంచనా వేశారు. ఆగష్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్న ప్రభుత్వం.. కొన్ని కీలకమైన కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లకు నిధులు కేటాయించినట్టు సమాచారం. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాదిలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు మరో రెండు నెలలు సమయం పడుతుందని ఏపీ సర్కార్ భావిస్తుంది. 2024 సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

డోలీ మోతలు ఉండకూడదు

ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన సంక్షేమశాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని అధికారులను ఆదేశించారు. గిరిజన మహిళల సౌకర్యం కోసం గర్భిణి వసతి గృహాలు, ట్రైకార్‌, జీసీసీ, ఐటీడీఏలను యాక్టివేట్‌ చేయాలని సూచించారు. గత ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసంతో గిరిజనుల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని చంద్రబాబు మండిపడ్డారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఫీడర్ అంబులెన్స్ లను తిరిగి ప్రవేశ పెట్టాలని ఆదేశించారు. 2014 నుంచి 2019 మధ్య అమల్లో ఉన్న పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థుల కోసం తెచ్చిన ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేడ్కర్‌ ఓవర్ సీస్ విద్యానిధి, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకాలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Tags

Next Story