పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం ఏకగ్రీవాలు జరగాలన్న జగన్‌కు షాక్!

పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం ఏకగ్రీవాలు జరగాలనే అధికార పక్షం టార్గెట్ దరిదాపుల్లో కూడా నెరవేరలేదు. ఎన్నికలు, పోటీ గురించి పక్కన పెడితే.. అసలు ఏకగ్రీవాలపైనే అందరి దృష్టి పడింది. అధికార పార్టీ అయితే.. ఏకంగా ఏకగ్రీవాలు అయ్యే పంచాయతీలకు 20 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకం కూడా ప్రకటించింది. కాని, ఎన్నికల కమిషన్ కాస్త సీరియస్‌గా ఉండడంతో ఏకగ్రీవాల హవా సాగలేదు.
పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3వేల 249 గ్రామ పంచాయతీలకు తొలి విడతలో ఎన్నికలు జరగనుండగా అందులో 452 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కొన్ని గ్రామాల్లో ఏళ్ల నుంచి ఉన్న ఆనవాయతీలను కొనసాగిస్తూ ఎన్నికలు ఏకగ్రీవంకాగా.. కొన్ని చోట్ల బుజ్జగింపులు, ప్రలోభాలతో పంచాయతీలను ఏకగ్రీవం చేశారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 96, అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 6 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పంచాయతీలకు ఈనెల 9న ఎన్నికలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.
చిత్తూరు జిల్లాలో 96 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. గుంటూరు జిల్లాలో 67, కర్నూలు జిల్లాలో 54, కడప జిల్లాలో 46, పశ్చిమ గోదావరి జిల్లాలో 40, శ్రీకాకుళం జిల్లాలో 34, విశాఖ జిల్లాలో 32, తూర్పు గోదావరి జిల్లాలో 28, కృష్ణా జిల్లాలో 20, ప్రకాశం జిల్లాలో 16, నెల్లూరు జిల్లాలో 14, అనంతపురం జిల్లాలో 6 పంచాయతీల్లో ఏకగ్రీవాలు జరిగాయి.
ఇక రెండో విడత నామినేషన్ల గడువు గురువారంతో ముగిసింది. రెండో దశలో 3వేల 335 పంచాయతీల్లో 33వేల 632 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆఖరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com