LOKESH: రెడ్ బుక్ ప‌ని స్టార్ట్ అయింది: నారా లోకేష్‌

LOKESH: రెడ్ బుక్ ప‌ని స్టార్ట్ అయింది: నారా లోకేష్‌
X
చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష తప్పదని పునరుద్ఘాటన.. జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు

ఆంధ్రప్రదేశ్‌లో రెడ్‌ బుక్ అమలు ఇప్పటికే ప్రారంభమైందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రెడ్‌ బుక్‌ అమలు చేస్తున్నామని, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో జరిగిన అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు కమిటీ వేశామని.. విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు. మరోవైపు వైఎస్ జగన్ నివాసంలోని ఫ‌ర్నీచ‌ర్‌పై ప్రభుత్వానికి వైసీపీ లేఖ రాయ‌డంపై లోకేశ్ ఎక్స్ వేదిక‌గా తీవ్రంగా స్పందించారు. జ‌గ‌న్ త‌న ముఠా స‌భ్యుల‌తో దొంగ ఉత్తరాలు రాయిస్తున్నార‌ని దుయ్యబ‌ట్టారు. "జగన్ దాదా 40 మంది దొంగలు రాష్ట్రంపై పడి బందిపోట్లులా దోచేశారు. చివ‌రికి సీఎం ప‌ద‌వి నుంచి జ‌గ‌న్‌ని జ‌నం దించేసినా.. సిగ్గు లేకుండా కుర్చీలు, టేబుళ్లు, సోఫాలు ఎత్తుకుపోయారు. అడ్డంగా దొరికిపోయిన దొంగ జగన్ .. తన ముఠా సభ్యులతో దొంగ ఉత్తరాలు రాయిస్తున్నాడు. ఆనాడు మా పెద్దాయన కోడెల శివప్రసాద రావు ఇదే లేఖ రాస్తే ఎంత అమానవీయంగా ప్రవర్తించావో గుర్తు తెచ్చుకో జగన్" అంటూ లోకేశ్ చుర‌క‌లంటించారు.

జగన్.. ఈ ఫేక్ ప్రచారాలు ఎందుకు

సోషల్ మీడియాలో వైసీపీ తప్పుడు ప్రచారాలపై నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. కల్తీ జగన్.. ఈ పేక్ ప్రచారాలు ఎందుకంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. వరద సాయం ఎంత ఇచ్చాం.. సహాయక చర్యలకు ఎంత ఖర్చయింది. ఆహారం కోసం ఎంత ఖర్చు పెట్టామనే లెక్కలు ఓపెన్‌గానే ఉన్నాయని.. వీటిపై అసత్య ప్రచారం ఎందుకని ప్రశ్నించారు. అయినా నీ దొంగ బుద్ధ వదలవంటూ జగన్‌పై మండిపడ్డారు . అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లంటూ నీ నీలి కూలీలతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నావంటూ లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు. వరదసాయంపై సోషల్ మీడియాలో ఓ తప్పుడు పోస్టు వైరల్ అవుతోంది. ఈ పోస్టును వైసీపీకి చెందిన సోషల్ మీడియా ట్రోల్ చేస్తుందన్న ప్రచారం నేపథ్యంలో మంత్రి లోకేశ్ వరద సాయం లెక్కలపై స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, లెక్కలన్నీ ఓపెన్‌గాను ఉన్నాయని చెప్పారు.

పారా క్రీడల అభివృద్ధి

రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని నారా లోకేశ్ క్రీడాకారులకు హామీ ఇచ్చారు. ఉండపల్లిలోని నివాసంలో మంత్రి లోకేశ్‌ను ఏఎమ్ఎఫ్ ఫౌండర్ ఆదిత్య మెహతా నేతృత్వంలో పారా క్రీడాకారులు కలిశారు. ఇటీవల పారిస్‌లో నిర్వహించిన పారాలింపిక్స్‌లో పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచిన షేక్ అర్షద్‌ను ఈ సందర్భంగా లోకేశ్ అభినందించారు. రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని, క్రీడాకారులకు మద్దతుగా నిలుస్తామని వారికి మంత్రి హామీ ఇచ్చారు.

Tags

Next Story