AP: ఛలో పుట్టపర్తిని అడ్డుకున్న పోలీసులు
సీఎం జగన్ పర్యటనను నిరసిస్తూ తెలుగుదేశం చేపట్టిన 'చలో పుట్టపర్తి'ని పోలీసులు అడ్డుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా తెలుగుదేశం నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందంటూ ఛలో పుట్టపర్తికి పిలుపునిచ్చిన తెలుగుదేశం నేతలు అక్కడకు వెళ్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. సీఎం కార్యక్రమానికి బయలుదేరిన మాజీ మంత్రి శంకర్ నారాయణను సత్యసాయి జిల్లా పెనుకొండలోని NTR కూడలి వద్ద తెలుగుదేశం శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. సీఎం గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నల్ల బెలూన్లు ఎగరవేశారు. ఈ దశలో తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఈ చర్యపై మండిపడిన తెలుగుదేశం నేతలు..... ఏ నేరం చేశామని తమను అదుపులోకి తీసుకుంటున్నారని ప్రశ్నించారు. సీఎం జగన్ కు దోపిడీపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని మండిపడ్డారు.
సీఎం జగన్ పుట్టపర్తి పర్యటన వేళ అధికారులు మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి పర్యటన పుట్టపర్తిలో ఉంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు బడులకు సెలవు ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలల బస్సులతో పాటు ఆర్టీసీ బస్సులను సీఎం పర్యటన కోసం వినియోగించారు. సీఎం సభకు జనాన్ని ఈ బస్సులోనే తరలించారు. బస్సులు లేక సాధారణ ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటే …..ఆర్టీసీ అధికారులు అధికార పార్టీ సేవలో తరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పుట్టపర్తిలో ముఖ్యమంత్రి సభ జరుగుతండానే జనం బయటికి వెళ్లిపోయారు. ఉదయం నుంచి సభలో ఉన్న జనం సీఎం జగన్ ప్రసంగం పూర్తికాక ముందే అక్కడి నుంచి నిష్క్రమించారు. చుట్టూ కట్టిన బారికేడ్లను దాటుకుని, అక్కడున్న గుట్టలపైకి ఎక్కి మరీ బయటపడ్డారు.
పోలీసులు అడ్డుచెబుతున్నా పట్టించుకోకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోతే చాలు అన్నట్లుగా సభ నుంచి వచ్చేశారు. రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం ద్వారా అన్నదాతలకు పెద్దఎత్తున లబ్ధి చేకూర్చామని సీఎం జగన్ తెలిపారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రైతు భరోసా నిధులు విడుదల చేశారు. నాలుగేళ్లలో ఏపీలో కరవే లేదన్న సీఎం...ఈ ఏడాది కాస్త ఇబ్బంది వచ్చినా అన్ని విధాల ఆదుకుంటామన్నారు. ఐదో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల చేశారు. బటన్ నొక్కి 53 లక్షల 53 వేల మంది రైతుల ఖాతాల్లో ...4 వేల రూపాయల చొప్పున ..2వేల 204 కోట్లు జమ చేశారు. ఐదేళ్లలో 33 వేల 209 కోట్ల పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు సీఎం వివరించారు. తన పాలనలో నాలుగేళ్లలో కరవే లేదన్న CM...ఈ ఏడాదే కాస్త ఇబ్బంది వచ్చినా దాన్ని అధిగమించే చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com