AP: ఏపీని అప్పుల కుప్పగా మార్చిన జగన్‌

AP: ఏపీని అప్పుల కుప్పగా మార్చిన జగన్‌
మండిపడ్డ ఏపీ ప్రొఫెషనల్‌ ఫొరం... కాగ్‌ నివేదికపై సమాధానం ఏదని నిలదీత

వైపీసీ ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో లక్షల కోట్లు రుణాలు తీసుకుని ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల కుప్పగా చేసిందని ఏపీ ప్రొఫెషనల్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా వేదికలో నేతలు ఆరోపించారు. అప్పుల పేరుతో తెచ్చిన సొమ్ములో మొత్తాన్ని ప్రజలకు పంచలేదన్న వారు దాదాపు 3లక్షల 40వేల కోట్లకు లెక్కలు లేవన్న కాగ్‌ నివేదికపై ఎందుకు సమాధానం చెప్పట్లేదని నిలదీశారు. ఈ సొమ్మంతా ఏమైందో తేలాలన్న నేతలు సంబంధిత కార్పొరేషన్ల అధికారులను బాధ్యులుగా చేస్తూ పిల్‌ వేయాలని నిర్ణయించారు. అప్పుడే పూర్తిస్థాయి వాస్తవాలు వెల్లడవుతాయని స్పష్టంచేశారు


ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అరాచకం రాజ్యమేలుతుందా అన్న అంశంపై విజయవాడలో ఏపీ ప్రొఫెషనల్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఏపీ ప్రొఫెషనల్‌ ఫోరమ్‌ అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌, ముస్లీంలీగ్‌ పార్టీల ప్రతినిధులతో పాటు వృత్తినిపుణులు, వివిధ రంగాలకు చెందిన మేధావులు పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సంక్షేమం మాటున లక్షల్లో అప్పులు చేసిందన్న నేతలు... ప్రస్తుతం రుణాలు 10 లక్షలు దాటాయన్నారు. ఇంకో నాలుగు నెలల కాలం ఉన్నందున అప్పు 11 లక్షల కోట్లు దాటే ప్రమాదం ఉందన్నారు. చేసిన అప్పుల్లో కొంతైనా మూలధనంపై వెచ్చించలేదని.., పరిశ్రమలు, ప్రాజెక్టులు సహా ఏ వ్యవస్థకూ ప్రోత్సాహం ఇవ్వలేదని అన్నారు. కొట్టుకుపోయిన ప్రాజెక్టు గేట్లను కూడా పెట్టలేదని ఆక్షేపించారు.


కార్పొరేషన్ల పేరుతో ఇష్టారీతిన అప్పులు తెచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ సొమ్మంతా ప్రజలకు పంచామంటూ అవాస్తవాలు చెబుతోందని నేతి మహేశ్వరరావు ఆరోపించారు. అందులో కొంతమేర మాత్రమే ప్రజలకు పంచి దాదాపు 3లక్షల 40 వేల కోట్ల రూపాయలను దోచేసిందని ఆరోపించారు. కేంద్ర సంస్థలు కూడా ఈ అరాచకాన్ని పట్టించుకోలేదన్నారు. అందుకే దీనిపై పిల్‌ వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కోర్టులో పిల్‌ వేసి ఆర్థిక అక్రమాలను నిరూపిస్తే సంబంధిత అధికారుల్లో భయం మొదలవుతుందన్న పార్టీల నేతలు... అప్పుడైనా నిబంధనల మేరకు వ్యవహరిస్తారని అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రొఫెషనల్‌ ఫోరమ్‌ చేస్తున్న పోరాటానికి తాము అండగా ఉంటామని స్పష్టంచేశారు. అడ్డదారుల్లో అప్పులు తెచ్చేందుకు.... ఐఏఎస్ అధికారులు సైతం సహకరించారని మండిపడ్డారు. అప్పులను అభివృద్ధికి ఖర్చు చేశామని చెబుతున్న ప్రభుత్వం........ కనీసం ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు కూడా చేపట్టలేదన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఎంత అప్పు చేశారు...., దేనికి ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో ఆర్థిక అవకతవకలపై...... కేంద్ర సంస్థలు జోక్యం చేసుకోవాలని కోరారు. సీఎం జగన్ ఏపీని అప్పుల్లో అగ్రస్థానానికి అభివృద్ధిలో అధఃపాతాళానికి నెట్టారని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story