AP: కారంపూడిలో మొదలైన అరెస్టుల పర్వం

AP: కారంపూడిలో మొదలైన అరెస్టుల పర్వం
వైసీపీకి చెందిన 11మంది, టీడీపీకి చెందిన 8మంది నేతల అరెస్ట్‌

పల్నాడు జిల్లా కారంపూడిలో ఈనెల 14న జరిగిన దాడులు, హింసాత్మక ఘటనలపై అరెస్టులు ప్రారంభమయ్యాయి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కారంపూడిలో తెలుగుదేశం కార్యాలయాన్ని ధ్వంసం చేయటంతో పాటు ప్రైవేటు ఆస్తులపై దాడులు చేశారు. కొన్ని వాహనాల్ని తగులబెట్టారు. ప్రతిచర్యగా టీడీపీ వర్గీయులు రోడ్లపైకి వచ్చి వైసీపీకి చెందిన వారి ఆస్తులపై దాడులు చేశారు. ఈ రెండు ఘటనలపైనా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. దాడులకు సంబంధించి పోలీసులు వైసీపీకి చెందిన 11మందిని, టీడీపీకి చెందిన 8మందిని అరెస్టు చేశారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్ని అరెస్టు చేసి వారిని కోర్టుకు తరలించే సందర్భంగా కుటుంబ సభ్యులు ఆవేదన వెలిబుచ్చారు. గొడవలు జరిగిన రోజు అక్కడ లేకపోయినా పోలీసులు అన్యాయంగా కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. నిజంగా దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా వదిలేశారన్నారు.


ఈసీ ఆగ్రహం

పోలింగ్‌ జరిగిన మే 13న పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా హింస చెలరేగిందని దీన్ని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఈసీ తెలిపింది. సీఎస్‌, డీజీపీతో గురువారం భేటీ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు కమిషనర్లు సమావేశమై ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తంచేశారు. రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని సీఎస్‌, డీజీపీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది.

పల్నాడు జిల్లాలో చెలరేగిన అల్లర్లను అడ్డుకట్టవేయడంలో విఫలమవ్వడంతో జిల్లా కలెక్టరు లోతేటి శివశంకర్‌పై బదిలీ వేటు వేయగా ఎస్పీ బిందు మాదవ్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. మారణాయుధాలు, నాటు బాంబులతో భారీ విధ్వంసానికి వైఎస్సార్సీపీ కుట్ర పన్నినట్లు పోలీసుల తనిఖీల్లో స్పష్టమైంది. ఈ స్థాయిలో విధ్వంసానికి తెర తీసినా పోలీసులు నిలువురించడంలో విఫలమవ్వడంతో ఈసీ చర్యలు తీసుకుంది. పల్నాడు ఎస్పీపై సస్పెన్షన్‌ వేటు వేసిన ఈసీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించింది.

Tags

Next Story