సీఎం జగన్‌పై ప్రతిపక్షనేత చంద్రబాబు తీవ్ర విమర్శలు

సీఎం జగన్ పై ప్రతిపక్షనేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో జగన్ లాంటి ఫేక్ ముఖ్యమంత్రిని చూడలేదని మండిపడ్డారు. వెక్కిలినవ్వులు, వెక్కిలిచేష్టలతో జగన్ వ్యవహరిస్తున్నారని.. అసెంబ్లీకి ఆలస్యంగా వచ్చే ముఖ్యమంత్రిని జగన్ ని మాత్రమే చూస్తున్నానని విమర్శించారు. జగన్ లాంటోళ్లని చాలా మందిని చూశానని.. మీ తాటాకు చప్పుళ్లకు ఇక్కడ ఎవరు భయపడరన్నారు. వైసీపీ వాళ్లు అధికారంలోకి గాలికొచ్చొరు.. ఆ గాలికే పోతారని చంద్రబాబు తెలిపారు. సభలో జగన్ తీరుతో మొదటిసారి తనకు కోపం వచ్చిందని.. అందుకే స్పీకర్ పోడియం ముందు బైఠాయించానని వెల్లడించారు.
అసెంబ్లీలో వరద నష్టంపై మాట్లాడాలని పట్టుబడితే వైసీపీ నేతలు మమ్మల్ని దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వరద సాయంపై ప్రభుత్వం గాలి కబుర్లు చెబుతోందని విమర్శించారు. వరదలు వస్తే రైతులను నేరుగా పరామర్శించకుండా గాల్లో తిరుగుతూ గాలి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. రైతులంటే ప్రభుత్వానికి ఇంత చిన్నచూపు ఎందుకని బాబు ప్రశ్నించారు.
తన జీవితంలో మొదటిసారి సస్పెండ్ అయ్యానని.. రైతులపై ప్రభుత్వం తీరు నచ్చకే పోడియం వద్దకు వెళ్లానని పేర్కొన్నారు. రైతుల కోసం ఎన్నిసార్లు సస్పెండ్ అవ్వడానికైనా సిద్ధమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com