దళితులు రాజకీయాల్లోకి రాకూడదా ?- చంద్రబాబు

అమరావతిలో ఎస్సీ వర్గీయులపై వైసీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తామంటూ ఎస్సీలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేయడం జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పాలనకు నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా స్వేచ్ఛగా పోటీ చేసే హక్కు ఉందని జగన్ రెడ్డి, వైసీపీ నేతలు గుర్తించాలన్నారు. పెద్దకూరపాడు నియోజకవర్గంలోని లింగాపురంలో నామినేషన్ వేశారనే కోపంతో దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అన్నారు చంద్రబాబు.
దళితులు రాజకీయాల్లోకి రాకూడదా... పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయకూడదా అంటూ బాబు ప్రశ్నించారు. వైసీపీ నేతల దాడి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అన్నారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించలేని పరిస్థితులు ఉన్నప్పటికీ.. ప్రజా మద్దతు ఉందని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. వైసీపీ గూండాలను గ్రామాల మీదకు వదిలి బడుగు బలహీనవర్గాల ప్రజలపై దాడులకు పాల్పడతారా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇళ్లకు వెళ్లి బెదిరించడమే కాకుండా.. మహిళల పట్ట అసభ్యంగా ప్రవర్తించడం అత్యంత హేయమైన చర్య అన్నారు చంద్రబాబు. కులం పేరుతో దూషించి, రాళ్లతో దాడి చేసిన వైసీపీ నేతలపై ఫిర్యాదు చేసినా.. పోలీసులు కేసు నమోదు చేయకపోవడం చూస్తుంటే... పోలీసు వ్యవస్థను ఎంతగా నీరుగారుస్తున్నారో అర్థమవుతోందన్నారు. నిందితులను అరెస్ట్ చేయాలని.. అర్థరాత్రి నుంచి స్టేషన్ బయటే పడిగాపులు కాస్తున్నా.. పోలీసులు పట్టించుకోకపోవడం ఆ వ్యవస్థ పనితీరుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా దాడికి పాల్పడిన వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే చర్యలు తీసుకోవాలని సూచించారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com