దాడులతో భయపెట్టాలని చూస్తే ఖబడ్దార్‌.. వైసీపీకి చంద్రబాబు స్ట్రాంగ్‌ వార్నింగ్

దాడులతో భయపెట్టాలని చూస్తే ఖబడ్దార్‌.. వైసీపీకి చంద్రబాబు స్ట్రాంగ్‌ వార్నింగ్
పట్టాభిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు.. చంపుతారా.. చంపండి చూస్తాం ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు.

టీడీపీ నేత పట్టాభిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇంటి నుంచి కారులో టీడీపీ ఆఫీసుకి వెళుతుండగా దాడి జరిగింది. ఈ ఘటనలో పట్టాభి కారు అద్దాలు, సెల్‌ఫోన్ ధ్వంసమయ్యాయి. బలవంతంగా డోర్ తెరిచి పట్టాభిపైనా దాడి చేశారు. ఇదంతా CC ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపించింది. గత రెండు నెలల్లో ఆయనపై జరిగిన రెండో దాడి ఇది. సుమారు 15 మంది తన వాహనంపై రాడ్లు, కర్రలు, బండ రాళ్లతో దాడి చేశారని పట్టాభి చెప్పారు. 10 రోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్నానని తనపై దాడి చేశారన్నారు పట్టాభి. పథకం ప్రకారం హత్య చేయాలని కుట్ర పన్ని దాడి చేశారని ఆరోపించారు. తన దాడి వెనక కొడాలి నాని, వల్లభనేని వంశీ ఉన్నారంటూ కామెంట్ చేశారు.

దాడి విషయం తెలియగానే చంద్రబాబు వెంటనే పట్టాభి నివాసానికి వచ్చి పరామర్శించారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. పట్టాభిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు.. చంపుతారా.. చంపండి చూస్తాం ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు. మీ ప్రాణం మీకు ఎంత ముఖ్యమో.. మా ప్రాణం మాకు అంతే ముఖ్యం అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే రిపీట్‌ అయితే జనం బట్టలిప్పి తరిమికొడతారని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గతంలో దాడి జరిగినప్పుడు పట్టాభికి భద్రత కల్పించి ఉంటే.. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా అని ప్రశ్నించారు.

పట్టాభిపై దాడి జరిగిన విషయం తెలియగానే దేవినేని ఉమ, బోండా ఉమ, బుద్దా వెంకన్న, గద్దె రామ్మోహన్‌, కొల్లు రవీంద్ర ఇతర టీడీపీ నేతలు స్వయంగా వచ్చి పరామర్శించారు. ప్రభుత్వ అవినీతిని ఎండగడుతున్నందుకే పట్టాభిపై వైసీపీ నేతలు దాడిచేయించారని ఆరోపించారు.

మరోవైపు పట్టాభిపై జరిగిన దాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేశారు. పట్టాభి ఇంటి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ముందుగానే కాపు కాసారు. ఆ తర్వాత పట్టాభిపై దాడి చేయడం వీడియోలో కనిపించింది. ముందుగా ముగ్గురు వ్యక్తులు వచ్చి దాడి చేయగా.. తర్వాత ఇంకో వ్యక్తి రాళ్లను కారుపైకి విసిరాడు. ఘటన తర్వాత దుండగులంతా పారిపోయారు. వీరంతా బైక్‌లపై అక్కడికి వచ్చినట్లు గుర్తించారు. పట్టాభి ఇంటి నుంచి బయటకు వస్తారని తెలుసుకుని పథకం ప్రకారం దాడి చేసి బైక్‌లపై అక్కడి నుంచి వెళ్లిపోయారు.

దాడి చేయడానికి వారం రోజుల నుంచి ఫ్లాన్ జరుగుతోందని పట్టాభి తనతో చెప్పారని ఆయన భార్య చెప్పుకొచ్చారు. తనను కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పారని.. ప్రతి రోజు ఇద్దరు ముగ్గురు పట్టాభి వెంట ఉంటారని.. ఇవాళ రాలేదని ఆమె తెలిపారు. ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లగానే దాడి జరిగిందన్నారు.

దాడిపై ముఖ్యమంత్రిని కలిసి మెమొరాండం ఇచ్చేందుకు దేవినేని, బోండా ఉమ, బుద్దా వెంకన్న, కొల్లు రవీంద్ర, ఇతర టీడీపీ నేతలు ప్రయత్నించారు. అయితే, పట్టాభితో సహా కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాడిపై సీఎం స్పందన చూసి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని చంద్రబాబు చెప్పారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తనపై ఇన్నిసార్లు దాడులు జరుగుతున్నాయని, ఇప్పటికైనా పోలీసులు నిజాయతీగా విచారణ చేయాలని పట్టాభి డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story