AP : తప్పు చేసిన వారిని వదిలిపెట్టం.. చంద్రబాబు వార్నింగ్

తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోనని టీడీపీ అధినేత చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ‘తప్పు చేసినవాడిని క్షమించి, పూర్తిగా వదిలిపెడితే అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలి. పదవి వచ్చిందని విర్రవీగొద్దు. వినయంగా ఉండాలి’ అని CBN స్పష్టం చేశారు.
ఏపీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని చంద్రబాబు అన్నారు. ‘నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నాను. కానీ ఈసారి ప్రత్యేకం. ప్రజలు మనకు అధికారం ఇవ్వలేదు. పవిత్రమైన బాధ్యత ఇచ్చారు. ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. కేంద్రం సహాయం అవసరమని బీజేపీ నాయకత్వాన్ని కోరాం. పూర్తిగా సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు’ అని చంద్రబాబు తెలిపారు.
కొత్తగా ఎన్నికైన MLAలతో ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశముంది. ఏకాదశి కావడంతో ఆ రోజు మంచిదని కొత్త ప్రభుత్వానికి పలువురు పండితులు సూచించినట్లు సమాచారం. 4 రోజుల పాటు కొనసాగే మొదటి సెషన్‌లో తొలిరోజు MLAల ప్రమాణ స్వీకారం, రెండోరోజు స్పీకర్ ఎన్నిక ఉండనుంది. ఇక ఈ భేటీలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించనున్నట్లు తెలుస్తోంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com