CM Chandrababu : అందుకే కన్నీళ్లు పెట్టుకున్నా: సీఎం చంద్రబాబు
గతంలో నాపై బాంబు దాడి జరిగినా కన్నీళ్లు పెట్టలేదని సీఎం చంద్రబాబు ( CM Chandrababu Naidu ) అన్నారు. కానీ రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని నా సతీమణిని వైసీపీ నేతలు అవమానించారని చెప్పారు. ‘ఆమెనే కాకుండా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరినీ కించపరిచే విధంగా మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అందుకే నా జీవితంలో మొదటిసారి ఆడబిడ్డల గురించి ఆ మాటలు విని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నా’ అని అసెంబ్లీలో సీఎం వివరించారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గతంలో సభలో తనను అవమానించిన ఘటనను సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ‘నా గురించి, నా కుటుంబం గురించి నీచంగా మాట్లాడారు. వారిపై యాక్షన్ తీసుకోకపోగా నిరసన తెలియజేయడానికి మైక్ అడిగితే ఇవ్వలేదు. అయినా రికార్డ్ కోసం స్టేట్‌మెంట్ ఇచ్చా. ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతాను తప్ప మళ్లీ అడుగుపెట్టను అని చెప్పా’ అంటూ అప్పటి కామెంట్స్‌ను మరోసారి ఆయన చదివి వినిపించారు.
రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిన్న అసెంబ్లీకి హాజరు కాలేని ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com