CEC Rajiv Kumar : ఆ 48 గంటలే అత్యంత కీలకం: సీఈసీ రాజీవ్ కుమార్

ఈ నెల 13న జరగనున్న నాలుగో దశ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. పోలింగ్‌కు ముందు 48 గంటలు కీలకమని.. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఏపీ, తెలంగాణని సునిశితమైన రాష్ట్రాలుగా గుర్తించాం. నగదు ప్రవాహాన్ని అడ్డుకోవాలి. హింసకు తావులేకుండా శాంతిభద్రతలు పరిరక్షించాలి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలి అని సూచించారు.
ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే నగదు, ఇతర ఉచితాల పంపిణీపై గట్టి నిఘా ఉంచాలని రాజీవ్‌కుమార్ సూచించారు. ప్రత్యేకించి సాధారణ, పోలీసు, వ్యయ పరిశీలకులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చూడాలని సూచించారు. ప్రత్యేకించి ఏపీలో కొన్ని జిల్లాలు ఎంతో సునిశితమైనవిగా గుర్తించామని, ప్రత్యేక పరిశీలకులు ఆయా జిల్లాల్లో తరచుగా పర్యటించాలని ఆదేశించారు.
ఎండలు, వడగాడ్పులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్రథమ చికిత్స సేవలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఓటు వేయడం సామాజిక బాధ్యత అనే విషయాన్ని ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని రాజీవ్‌కుమార్ దిశానిర్దేశం చేశారు. ఎస్‌ఎంఎస్‌లు, సోషల్ మీడియా ద్వారా ఓటర్లను చైతన్య పరచాలన్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com