AP: కూటమి అభ్యర్థుల ప్రచార జోరు

AP: కూటమి అభ్యర్థుల ప్రచార జోరు
ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు... అవనిగడ్డ కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. మూడు పార్టీల కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ ఏ విధంగా నష్టపోయిందో ప్రజలకు వివరిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక అమలు చేయబోయే సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అవనిగడ్డ కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని శ్రీకాకుళం నుంచి అవనిగడ్డ వరకు సంకల్ప ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, పసుపు దళం, బీజేపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్‌ తనయుడు హర్షవర్ధన్‌... టీ టైమ్‌ విత్‌ అద్దంకి నిర్వహించారు. దుకాణాల వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ... తెలుగుదేశం పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు.


ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం నేతలు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఒంగోలు మర్రిచెట్టు వద్ద ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసి ప్రచార రథాన్ని ప్రారంభించారు. నెల్లూరు అర్బన్‌ కూటమి అభ్యర్థి నారాయణ... నగరంలోని 42వ డివిజన్‌లో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఓటర్లకు పార్టీ కరపత్రాలను అందజేసి... సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి వివరించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కె.తిమ్మాపురానికి చెందిన వంద మంది సీపీఐ కార్యకర్తలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు.

చిత్తూరు కూటమి అభ్యర్థి గురజాల జగన్‌మోహన్‌ నగరంలోని డివిజన్లలో ప్రచారం చేశారు. వైసీపీ రాక్షస పాలనను తరిమికొట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కర్నూల్ జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం మండలం ఉప్పరహాల్ గ్రామం నుంచి 50కుటుంబాలు వైసీపీని వీడి తెదేపాలో చేరాయి. కూటమి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి వారికి పార్టీ కండువా కప్పారు. నంద్యాలలోని గిరినాథ్‌ సెంటర్‌లో తెలుగుదేశం ప్రచారం నిర్వహించింది. కూటమి అభ్యర్థి N.M.D. ఫరూఖ్‌ కుమారుడు N.M.D. ఫిరోజ్‌ ఇంటింటికీ తిరిగి ఓటర్లను చైతన్యవంతం చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ఆధ్వర్యంలో కోవూరు, రాజుపాలెంకు చెందిన కొంత మంది తెలుగుదేశంలో చేరారు..

Tags

Read MoreRead Less
Next Story