AP: ఏపీలో స్ట్రాంగ్‌రూంల వద్ద నిరంతర నిఘా

ఆంధ్రప్రదేశ్‌లో E.V.M.లు స్ట్రాంగ్‌రూంలకు చేరడం ఆలస్యమైంది. సోమవారం అర్థరాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజామువరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య E.V.M.లను తరలించారు. నియోజకవర్గాలు, బూత్‌ల వారీగా స్ట్రాంగ్‌రూంల్లో ఈవీఎంలు భద్రపరిచి అధికారులు సీల్ వేశారు. స్ట్రాంగ్‌రూంల వద్ద మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నిరంతరం CC కెమెరా పర్యవేక్షణ కొనసాగుతోంది
ఓటర్లు పోటెత్తి... సోమవారం అర్థరాత్రి వరకు పోలింగ్ సాగడంతో...EVMల తరలింపు ఆలస్యమైంది. పోలింగ్ కేంద్రాల నుంచి పకడ్బందీ బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనాల్లో EVMలను స్ట్రాంగ్‌రూంలకు తరలించి భద్రపరిచారు. N.T.R. జిల్లా తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 234 బూత్‌లకు సంబంధించిన E.V.M.లను ఇబ్రహీంపట్నంలోని నోవా ఇంజినీరింగ్ కళాశాలకు తరలించారు. నందిగామకు చెందిన 222 ఈవీఎంలను సైతం ఇదే కళాశాలలో భద్రపరిచారు. నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న ఈవీఎంలను ఒకచోటకు చేర్చి...అక్కడి నుంచి భారీబందోబస్తు మధ్య స్ట్రాంగ్‌రూంలకు తరలించారు. నోవా, నిమ్రా ఇంజినీరింగ్ కళాశాలల్లో భద్రపరిచిన E.V.M.లను కలెక్టర్ పరిశీలించారు. గుడివాడ, మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, పామర్రుకు చెందిన ఈవీఎంలను కృష్ణా యూనివర్సిటీలోని ప్రధాన స్ట్రాంగ్‌రూంకు తరలించారు. స్ట్రాంగ్‌రూంల వద్ద కేంద్ర పారామిలటరీ బలగాలతోపాటు రాష్ట్ర పోలీసులు పహారా కాస్తున్నారు.
గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన EVMలను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు. అధికారుల సమక్షంలో స్ట్రాంగ్‌రూం సీజ్ చేసి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లావ్యాప్తంగా మొత్తం 1900 పోలింగ్ బూత్‌ల నుంచి EVMలను పటిష్టమైన భద్రత మధ్య ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్‌రూంకు తరలించారు. సత్యసాయి జిల్లా హిందూపురం సమీపంలోని బిట్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్ కు ఈవీఎంలను తరలించి భద్రపరిచారు. మడకశిర, పెనుగొండ, కదిరి, హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంటుకు సంబంధించిన E.V.M.లను భద్రపరిచారు. కర్నూలు జిల్లాలోని E.V.M. యంత్రాలను రాయలసీమ యూనివర్సిటీకి తరలించారు. 8 అసెంబ్లీ, కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాల ఈవీఎంలు వర్సిటీలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు.
అనంతపురం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తెల్లవారుజామున JNTUలోని స్ట్రాంగ్‌రూంకు EVMలను తరలించారు. కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల అధికారులు స్ట్రాంగ్‌రూంను పరిశీలించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలోని ఈవీఎంలను రాయచోటి సాయి ఇంజినీరింగ్ కళాశాలకు తరలించి స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com