AP : పోలవరం నిర్వాసితులను మోసం చేసిన జగన్: చంద్రబాబు

పోలవరం నిర్వాసితులకు ఎకరానికి రూ.19 లక్షలు, అదనంగా మరో 5 లక్షలు ఇస్తామని చెప్పి జగన్ ( YS Jagan ) మోసం చేశారని సీఎం చంద్రబాబు ( CM Chandrababu Naidu ) విమర్శించారు. నాలుగేళ్లలో ఒక్కరికీ పరిహారం అందలేదని ఆరోపించారు. పైగా లబ్ధిదారుల జాబితా మార్చి అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. సకల వసతులతో పునరావాస కాలనీలు ఏర్పాటు చేస్తామని చెప్పి కొత్తగా ఒక్క ఇల్లు కూడా కట్టలేదని ఫైరయ్యారు.
2014-19 మధ్య తాము పోలవరానికి రూ.11,762 కోట్లు ఖర్చు చేస్తే.. YCP ప్రభుత్వం రూ.4,167 కోట్లే వ్యయం చేసిందని CM చంద్రబాబు తెలిపారు. జగన్ ప్రమాణస్వీకారం చేయగానే పనులను ఆపేశారని ఆరోపించారు. ప్రత్యామ్నాయం లేకుండానే కాంట్రాక్టర్లను తొలగించారని, సమర్థులైన అధికారులను బదిలీ చేశారని విమర్శించారు. డయాఫ్రం వాల్ దెబ్బతిన్న విషయం జగన్‌కు రెండేళ్ల తర్వాత తెలిసిందని, ఆ తర్వాతా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
2014లో రాష్ట్ర విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టం కంటే ఐదేళ్ల జగన్ పాలన వల్లే ఎక్కువ డ్యామేజ్ జరిగిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. దీనికి పోలవరం విధ్వంసం ఒక ఉదాహరణ అని చెప్పారు. తమ హయాంలో 73% పనులను పూర్తి చేస్తే.. YCP పాలనలో 4% కూడా పూర్తవలేదని ఆరోపించారు. జగన్ మూర్ఖత్వం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు గెలిచారని, ఇక రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com