AP: ముగిసిన జగన్ ప్రభుత్వ డెడ్‌లైన్‌

AP: ముగిసిన జగన్ ప్రభుత్వ డెడ్‌లైన్‌
ఏ మాత్రం వెనక్కి తగ్గని అంగన్‌వాడీలు... ఎక్కడిక్కడ అరెస్టులు, నిర్బంధాలు..

ఉదయం 10గంటలలోపు విధుల్లో చేరని అంగన్వాడీ వర్కర్ లు, హెల్పర్లను ఉద్యోగంలో నుంచి తీసివేయాలని జగన్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు టర్మినేషన్ ఆర్డర్ లు జారీ చేయాల్సింది గా జిల్లా కలెక్టర్ లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10 గంటల లోపు విధుల్లో చేరిన అంగన్వాడీ హెల్పర్ లకు వర్కర్ లుగా పదోన్నతులు కల్పించాలని ఉత్తర్వుల్లో తెలిపారు. పార్వతిపురం మన్యం జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లోనూ టర్మినేషన్ ఉత్తర్వులు జారీ చేసేందుకు కలెక్టర్లు సిద్ధం చేశారు.


మరోవైపు ప్రభుత్వ డెడ్‌లైన్‌ ఇచ్చినా అంగన్‌వాడీలు వెనక్కి తగ్గలేదు. డిమాండ్ల సాధన కోసం చలో విజయవాడ పేరుతో ఆందోళనకు పిలుపునిచ్చిన అంగన్వాడి కార్యకర్తలను పోలీసులు ఎక్కడికిక్కడ అరెస్టులు చేశారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాజా టోల్గేట్, తాడేపల్లి లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే అన్ని మార్గాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అందర్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పంపిస్తున్నారు. కాజా టోల్ గేట్ వద్ద ఆందోళన చేస్తున్న 120 మంది అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని గుంటూరులోని పోలీస్ కళ్యాణ మండపానికి తరలించారు. ముఖ్యమంత్రి నివాస సమీపంలో ఆందోళన చేసేందుకు వచ్చిన ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. అనుమతి లేకుండా ఎవరు వచ్చినా అరెస్టులు తప్పవని జిల్లా ఎస్పీ అరిఫ్ హఫీజ్ హెచ్చరించారు.


ఛలో విజయవాడకు అనుమతి లేదంటూ.. ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ నుంచి వెళ్లిన 60 మంది అంగన్వాడీలను రాత్రి 2 గంటల సమయంలో గుంటూరు బస్టాండ్ లో..పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి అంగన్వాడీలను నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంగన్వాడీలు పోలీసు స్టేషన్ లోనే నిరసన చేపట్టారు. డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న తమ ఉద్యమాన్ని అడ్డుకోవడం ప్రభుత్వ చేతకాని తనమని విమర్శించారు.

సీఎం క్యాంప్ కార్యాలయ ముట్టడికి వెళ్లొద్దన్న పోలీస్ శాఖ ఆజ్ఞలు ఉల్లంఘిస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంగన్వాడీలను ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. అంగన్వాడీలు తలపెట్టిన 'చలో విజయవాడ' సీఎం క్యాంప్ కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి ప్రభుత్వ, పోలీసుశాఖల నుంచి ఎటువంటి అనుమతి లేదని ఎస్పీ తెలిపారు. సీఎం క్యాంప్ ముట్టడికి వెళ్లొద్దని బాపట్ల జిల్లా అంగన్వాడీలకు నోటీసులు జారీ చేశామన్నారు.జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులు, బస్ స్టాండ్ లు, రైల్వేస్టేషన్లు సహా ఇతర ముఖ్య ప్రదేశాలలో తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ జిందాల్ తెలిపారు. గుంటూరు, తాడేపల్లి, విజయవాడ కమిషనరేట్ పరిధిలోనూ గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. సీఎం క్యాంప్ ముట్టడికి వెళ్తూ పోలీసులకు పట్టుబడినవారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ జిందాల్ ..అంగన్వాడీలను హెచ్చరించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించకుండా పోలీసులకు సహకరించాలని ఎస్పీ జిందాల్ అంగన్వాడీలను కోరారు.

Tags

Read MoreRead Less
Next Story