Case Against jagan : రఘురామ మర్డర్ అటెంప్ట్ కేసులో ఏ3గా జగన్

ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక మాజీ సీఎం జగన్ ( Y S Jagan ) పై తొలి కేసు నమోదైంది. గుంటూరు జైలులో కస్టడీలో ఉన్నప్పుడు తనపై హత్యాయత్నం జరిగిందని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ3గా జగన్ పేరును చేర్చారు. ఏ2గా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ రామాం జనేయులు, ఏ1గా మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పేరును నమోదు చేశారు. ఏ4గా విజయపాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతి పేర్లు ఉన్నాయి.
రఘురామ ఫిర్యాదుపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత గుంటూరు నగరంపాలెం పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. 2021 మే 14 వ తేదీన మాజీ సిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అప్పటి ఎంపీ రఘురామక్రిష్ణంరాజుపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో ఉన్న ఆయనను అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించారు. రాత్రంతా కార్యాలయంలోనే విచారించారు. తనను అక్రమంగా అరెస్టు చేసి వేధించారని, ఐదుగురు ఆగంతకులతో దారుణంగా హింసించి వీడియో తీసి అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి చూపించారని రఘురామకృష్ణరాజు తెలిపారు.
తప్పుడు రిపోర్టు కోసం డాక్టర్లను కూడా మార్చేసిన పరిస్థితి నెలకొందని, అన్ని డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని ఆయన వెల్లడించారు. జగన్, సునీల్ ఇద్దరూ కలిసి తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. ఎంతటివారైనా తప్పు చేస్తే శిక్ష తప్పదనేది రుజువవుతుందని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com