YCP: జగన్‌ సభలకు స్పందన కరువు

YCP: జగన్‌ సభలకు స్పందన కరువు
బహిరంగ సభల పేరుతో ప్రజలకు అవస్థలు... జనాలను బలవంతంగా తరలించేందుకు విఫలయత్నం

ఐదేళ్ల పాలనలో ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేసిన సీఎం జగన్ తీరా ఎన్నికలు వచ్చినా తన ప్రతాపాన్ని కొనసాగిస్తున్నారు. బహిరంగ సభల పేరుతో స్థానికులను అవస్థలకు గురిచేస్తున్నారు. బలప్రదర్శన కోసం జనాలను బలవంతంగా తరలించేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో మేమంతా సిద్ధం పేరుతో జగన్ నిర్వహించిన సభ ప్రజల నుంచి స్పందన లేక నిశ్శబ్దంగా మారింది. జగన్ సభలంటేనే జనం పారిపోతున్నారు. సభా ప్రాంగణం పరిసరాల్లోనూ సంచరించే సాహసం చేయడం లేదు. సీఎం సభకు బస్సులు పెట్టి తరలిస్తున్నా అరకొరగానే స్పందన కనిపిస్తోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా కోడుమూరులో సీఎం జగన్ పర్యటించారు. కార్యక్రమానికి జనాల నుంచి ఆదరణ కరవైంది. బస్సులు పెట్టి మరి వైకాపా నాయకులు జనాలను తరలించారు. అయినా అరకొరగానే యాత్రకు జనం వచ్చారు.


కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సీఎం జగన్ పర్యటన స్థానికులకు అవస్థలు తెచ్చిపెట్టింది. సీఎం బహిరంగ సభకు ప్రజలు తరలించేందుకు బస్సున్నింటినీ కేటాయించారు. దీంతో సర్వీసుల్లేక గమ్యస్థానాలకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికంగా ఛార్జీలు చెల్లించి ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మిగనూరులో సీఎం జగన్ సభకు వచ్చిన మహిళలకు వైసీపీ నాయకులు బహిరంగంగా డబ్బులు పంచడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సీఎం సభ కోసం తరలించిన మహిళలందరినీ వైసీపీ నాయకులు ఓ చోటికి చేర్చారు. డబ్బులు ఉంచిన కవర్ లను వారికి అందించారు. కవర్ లో ఒక్కొక్కరికి రెండొందల నుంచి మూడొందల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు ముఖ్యమంత్రి జగన్ మోసపూరిత వాగ్దానాలు చేశారని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. 144 హామీలు అమలు చేయకుండా మడమ తిప్పారని మండిపడ్డారు. వివేకా హత్య పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు మరో కుట్రకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వివేకాను ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలుసన్నారు. జగన్ ను ప్రజలను నమ్మరని... గద్దె దింపటానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు..

Tags

Read MoreRead Less
Next Story