PAWAN: ఓటమిని జీర్ణించుకోలేరా..?

PAWAN: ఓటమిని జీర్ణించుకోలేరా..?
X
వైసీపీ నేతలపై పవన్‌ కల్యాణ్‌ వ్యంగ్యాస్త్రాలు... అయ్యన్న హుందాతనం చూస్తారన్న జనసేనాని

వైసీపీ నాయకులు ఓటమిని స్వీకరించలేని పిరికివారని ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు అసెంబ్లీ స్పీకర్‌గా రావడం సంతోషకరమన్నారు. అయ్యన్నపాత్రుడిలో ఇన్ని దశాబ్దాలు ప్రజలు వాడివేడిని చూశారని అన్నారు. ఇకపై ఆయనకు కోపం వస్తే తిట్టడానికి అవకాశం లేదని, అల్లరి పిల్లాడికి క్లాస్‌ లీడర్‌ బాధ్యతలు అప్పచెప్పినట్లయిందని స్పీకర్‌ను ఉద్దేశించి పవన్‌ అనడంతో సభలో నవ్వులు వెల్లివిరిశాయి. ఇన్నాళ్లూ ప్రజలు ఆయన వాగ్ధాటి చూశారని, నేటి నుంచి హుందాతనం చూస్తారని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా బూతులు, వ్యక్తిగత దూషణలకు తావివ్వని చర్చలు సాగాలని పవన్‌ అభిలాషించారు. భాష మనసులను కలపడానికే.. విడగొట్టడానికి కాదన్నారు. విభేదించడం అంటే ద్వేషించడం కాదన్నారు. వాదించడమంటే కొట్టుకోవడం కాదని, విభేదించడం, వాదించడం అనేవి చర్చను మరింత ఉన్నత దశకు తీసుకెళ్లేలా ఉండాలని సూచించారు.

శాసనసభలో ప్రతిపక్షం ఉన్నా లేకున్నా నిర్మాణాత్మకంగా సభను నిర్వహిస్తామని పవన్‌ సృష్టం చేశారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి చట్టాన్ని ఇప్పటి వరకు సరిగ్గా ఉపయోగించుకోలేదని తెలిపారు. ఈ చట్టాన్ని ఉపయోగించుకుని వ్యవస్థని సంస్కరించాలని అనుకుంటున్నట్టు తెలిపారు. గెలుపు కోసం కష్టపడ్డామని.. పోరాటాలు చేశామని అందుకే పోటీ చేసిన 21 స్థానాల్లో గెలుపొందామన్నారు. పని చేసుకుంటూ పోతే ఫలితం అదే వస్తుంది. డిప్యూటీ స్పీకర్‌ ఎవరికి ఇస్తారనేది ఇంకా తేలలేదన్నారు.

నూతన సభాపతి

సభాపతిగా ఏకగీవ్రంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడిని అభినందిస్తూ చంద్రబాబు శనివారం శాసనసభలో ప్రసంగించారు. అయ్యన్నపాత్రుడు చట్టసభల విలువ తెలిసిన వ్యక్తన్న చంద్రబాబు... ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని నిలుపుతారని అన్నారు. సభను హుందాగా నడిపిస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. కౌరవసభను.. గౌరవసభగా మార్చిన తర్వాతే ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని చెప్పి ౨౦౨౧ నవంబరు 19న సభలో నుంచి వెళ్లిపోయాను. మళ్లీ ప్రజలందరి ఆశీస్సులు, ఆమోదంతో సభలోకి ప్రవేశించానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. తన గౌరవాన్ని కాపాడిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగా పుట్టాలని, తెలుగుగడ్డ రుణం తీర్చుకోవాలనేది నా ఆకాంక్ష అని భావోద్వేగానికి గురయ్యారు.

Tags

Next Story