AP : అమరావతిలో మళ్లీ వెలిగిన లైట్లు

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే అమరావతికి మళ్లీ కళ వచ్చింది. రాజధాని అమరావతి ప్రధాన మార్గమైన సీడ్ యాక్సిస్ రోడ్డుపై వీధి దీపాలకు మరమ్మతులు చేపట్టి సోమవారం అన్నింటినీ వెలిగించారు. ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ వెంకటపాలెం నుంచి రాయపూడి వరకు స్వయంగా వీధి దీపాలను పరిశీలించారు. ఇంజినీరింగ్ అధికారులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
అమరావతిని వైసీపీ నిర్లక్ష్యం చేయడంతో రాజధాని రైతులు ఇన్నాళ్లు ఆగ్రహంతో ఉన్నారు. టీడీపీ కూటమి సంపూర్ణ ఆధిక్యత రావడంతో రాజధాని గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి పనులు త్వరలో పునప్రారంభం అవుతాయని రైతులు భావిస్తున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి తుళ్లూరు మండలం ఉద్దండ్రా యునిపాలెం గ్రామంలో 2015 అక్టోబరు 22న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మిస్తామని ప్రజలకు ఆయన మాటిచ్చారు.
ప్రమాణ స్వీకారం సందర్భంగా నిర్వహించే సభలోనూ చంద్రబాబు మరోసారి అమరావతిపై కీలక ప్రకటన చేసే చాన్సుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com