LOKESH: దొంగ ఓట్లనే నమ్ముకున్న వైసీపీ
దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ప్రభుత్వ ముఖ్య సలహదారు, వారి కుటుంబానికి రెండు ఓట్లు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి ఎక్కడని ప్రశ్నిస్తే మంత్రులు పిట్టకథలు చెబుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే వైసీపీ పేటీఎం బ్యాచ్‌పై కఠిన చర్యలు తప్పవని లోకేష్ హెచ్చరించారు. విజయనగరం జిల్లా రాజాం, చీపురుపల్లిలో నిర్వహించిన శంఖారావం సభల్లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు. అధికార వైసీపీ తీరుపై విమర్శనాస్ర్తాలు సంధించారు. వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లతో అధికారంలోకి రావాలని వైసీపీ యత్నిస్తోందని ఆరోపించారు.
చట్టాన్ని ఉల్లంఘించిన ఏ అధికారైనా తన రెడ్‌బుక్‌లోకి ఎక్కక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెత్త సలహాలు ఇస్తూ కోట్ల రూపాయల జీతం తీసుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ కేబినెట్ దేశంలోనే "చెత్త కేబినెట్"గా నిలిచిందని చురకలంటించారు. పన్నుల భారం మోపి ప్రజలను జగన్ దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం - జనసేన అధికారంలోకి రాగానే పేదలకు మరింత సంక్షేమం అందిస్తామని రాజాం సభలో ప్రకటించారు. ఉత్తరాంధ్రపై మూడు కుటుంబాల పెత్తనం సాగుతోందని లోకేష్ ధ్వజమెత్తారు. ఆ కుటుంబాలు కనిపించిన భూమినల్లా మింగేస్తున్నారని దుయ్యబట్టారు.
వైసీపీ నేతల భూకబ్జాలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. సెంట్ స్థలాల పేరుతో ప్రభుత్వం వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని... తెలుగుదేశం - జనసేన అధికారంలోకి రాగానే పేదలకు రూపాయి ఖర్చు లేకుండా పక్కా గృహాలు కట్టిస్తామని చీపురుపల్లి సభలో హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లాను క్యాన్సర్ గడ్డలా పీడిస్తున్న బొత్స కుటుంబం పోవాలంటే... ఓటు ద్వారా రేడియేషన్ ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘ఉద్యమాల పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర. ఎన్ని కేసులు పెట్టినా భయపడని కార్యకర్తలకు నా వందనం. తిరుపతి ఉప ఎన్నికలో వైకాపా గెలుపునకు కారణం దొంగ ఓట్లే. వాటిని నమోదు చేస్తున్న వారిపై చర్యలు తప్పవని ఆనాడే చెప్పా. ఏకంగా డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు సస్పెండ్ అయ్యారు. రేపో మాపో విచారణ నివేదిక బయటకొస్తుంది.. వారంతా ఇక జైలుకే. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరికైనా శిక్ష తప్పదు’’ అని లోకేశ్ హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com