CFD: ఎన్నికల కమిషన్‌కు ఎందుకీ ఉదాసీనత

CFD: ఎన్నికల కమిషన్‌కు ఎందుకీ ఉదాసీనత
ఏపీలో ఓట్ల అవకతవకలపై నిమ్మగడ్డ రమేశ్‌ ఆవేదన... చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీత

దేశవ్యాప్తంగా ఎన్నికలను సజావుగా నిర్వహిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్.. ఏపీలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఓట్ల అవకతకలపై ఎందుకు దృష్టి సారించట్లేదని నిలదీశారు. ఓట్ల అక్రమాలు ఈసీకి చేరకుండా అజ్ఞాత శక్తులు అడ్డుకుంటున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఓట్ల జాబితాలో అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్క అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రేపు రాష్ట్ర పర్యటనకు వస్తున్నఎన్నికల అధికారులు ఓట్ల అక్రమాలకు చెక్ పెట్టాలని కోరారు. నిబంధనలకు విరుద్దంగా జాబితాలో నుంచి ఓటర్లను తొలగించడం నేరమేనని,అక్రమంగా ఓట్లు తొలగించే అధికారులు శిక్షార్హులేనని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.



ఏపీ భూ హక్కుల చట్టం హేతుబద్ధంగా లేదని... సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆక్షేపించారు. ఈ చట్టంతో ప్రజలకు ఉపయుక్తంగా లేదని... ఆస్తులను రక్షించుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. బ్రిటిష్ కాలం నుంచి ప్రజలకు సంక్రమించిన హక్కులను ప్రభుత్వం హరిస్తోందని మండిపడ్డారు. ఎల్ టీఓ అనే వ్యక్తికి విస్తృత అధికారాలు ఇచ్చి.... గిట్టనివారిని, ప్రతిపక్షాలను వెంటాడేందుకు అవకాశం కల్పించారని మండిపడ్డారు. ఎలాంటి సంప్రదింపులు చేయకుండా ఏకపక్షంగా తీసుకురావడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.

మరోవైపు... కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం... నేటి నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ సహా ఇతర అధికారులు విజయవాడ చేరుకోనున్నారు. మంగళవారం ఉదయం రాజకీయ పార్టీలతో భారత ఎన్నికల చీఫ్ కమిషనర్ బృందం సమావేశం కానుంది. ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఇతర ఫిర్యాదుల పై... రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, జిల్లాల ఎన్నికల అధికారులు కలెక్టర్లు, ఎస్పీల తో సీఈసీ సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల సన్నద్ధత పై A.P C.E.O ముఖేష్ కుమార్ మీనా బుధవారం ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కేంద్ర విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా వివిధ శాఖల కార్యదర్శులతో సీఈసీ సమావేశం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు సీఈసీ, ఎన్నికల కమిషనర్ లు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం దిల్లీకి కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్, ఎన్నికల కమిషనర్ లు తిరిగి వెళ్లనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story