AP : ఏ దాడులూ నన్ను ఆపలేవు.. తొలిసారి స్పందించిన జగన్

చీకట్లో నుదురుకు తగిలిన రాయిదాడిపై తొలిసారి స్పందించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. విజయవాడ సమీపంలోని కేసరపల్లి దగ్గర తనను పరామర్శించేందుకు వచ్చిన నేతలతో మాట్లాడారు. డాక్టర్లు విశ్రాంతి సూచించడంతో ఒక్కరోజు విరామం అనంతరం నేటి ఉదయం మేమంతా సిద్ధం యాత్రను ప్రారంభించారు. యాత్ర ప్రారంభానికి ముందే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా నేతలు సీఎం జగన్‌ను కలిసి పరామర్శించారు.
బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసే దాడులు చేస్తున్నారని అన్నారు జగన్. ప్రజల ఆశీర్వాదం వల్ల ప్రాణాపాయం తప్పిందన్నారు. మరోసారి అధికారంలోకి వస్తున్నాం.. ఎవరూ ఆందోళన చెందవద్దని కేడర్ కు ధీమా ఇచ్చారు జగన్. ఎలాంటి దాడులూ తనను ఆపలేవని, ధైర్యంతో ముందడుగు వేద్దామని పార్టీ నేతలు, కార్యకర్తలకు సీఎం జగన్ ధైర్యం చెప్పారు.
వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని, బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణను చూసే ఈ దాడికి పాల్పడ్డారని సీఎం జగన్ దృష్టికి వైసీపీ నేతలు తీసుకెళ్లారు. శనివారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఎవరో రాళ్లతో దాడి చేయడంతో గాయపడ్డారు. అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో ఎవరో విసిరిన రాయి తగలడంతో జగన్ ఎడమ కనుబొమ్మకు దెబ్బ తగిలింది. దీనిపై ఉన్నత స్థాయిలో విచారణ జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com