AP : పిఠాపురంలో పవన్ ప్రచారం స్కెచ్ ఇదే..1

జనసేన (Janasena) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారని జనసేన నాయకుడు పి.హరిప్రసాద్ తెలిపారు.
పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని.. అందుకు అనుగుణంగానే పర్యటన షెడ్యూల్స్ రూపొందించాలని సోమవారం లీడర్లకు పవన్ స్పష్టం చేశారు. మూడు విడతలుగా ప్రచారం చేయాలని పవన్ నిర్ణయించారు. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్ళేలా షెడ్యూల్ ఉండాలని పవన్ కళ్యాణ్ తమ నాయకులు స్పష్టం చేశారు. పిఠాపురం వెళ్ళిన తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పురూహూతిక అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. అక్కడ వారాహి వాహనానికి పూజలు చేయించి, అనంతరం దత్తపీఠాన్ని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత రోజు నుంచి మూడు రోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటారు. పిఠాపురం పరిధిలోని బంగారు పాప దర్గా సందర్శన, క్రైస్తవ పెద్దలతో సమావేశం ఉంటాయి. సర్వమత ప్రార్థనల్లో పాల్గొంటారు. ఉగాది వేడుకలను పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ నిర్వహించుకోబోతున్నారు.
మధ్యలో పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. క్రియాశీలక కార్యకర్తలతో మండలాలవారీగా సమావేశాలు ఉంటాయి. కూటమి భాగస్వాములైన తెలుగుదేశం, బీజేపీ నాయకులతో భేటీలకు ఏర్పాట్లు చేస్తున్నారు. పిఠాపురం నుంచే రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com