JAGAN: జగన్ పర్యటన వేళ ప్రజలకు తప్పని తిప్పలు
సీఎం జగన్ పర్యటన ఉందంటే అది ఎక్కడైనా ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ఆయన వెళ్లిన ప్రతిచోటా ఆంక్షలతో పాటు బస్సులను దారి మళ్లించడంతో జనం అవస్థలు పడుతున్నారు. కడపలో జగన్ పర్యటన వేళ ఉదయం నుంచి పోలీసులు తీవ్రమైన ఆంక్షలు విధించడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సీఎం జగన్ పర్యటన వేళ కడప ఆర్టీసీ బస్టాండ్ లోకి బస్సులు రాకుండా దారి మళ్లించడంతో నిర్మానుష్యంగా మారింది.. వివిధ జిల్లాల నుంచి కడపకు వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ శివారు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలియక చాలామంది ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండుకు వచ్చి వెనుదిరిగారు.
శివారు ప్రాంతంలో బస్సులు నిలిపివేయడంతో ఆటోలకు అధిక ఛార్జీలు వెచ్చించి వెళ్లాల్సి పరిస్థితి ప్రయాణికులకు ఏర్పడింది. సీఎం పర్యటన మధ్యాహ్నం అయితే ఉదయం నుంచే బస్సులు నిలిపేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం వస్తే బస్సులు దారి మళ్లించాల్సిన అవసరం ఏంటని జనం నిలదీశారు. సీఎం పర్యటించే ప్రాంతాల వద్ద బారికేడ్లు, పరదాలూ పోలీసులు ఏర్పాటు చేశారు. కమలాపురం నియోజకవర్గాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించాలని సీఎం జగన్‌కు వినతిపత్రం ఇస్తామంటూ రైతులతో కలిసి ర్యాలీ చేపట్టిన టీడీపీ నేత కాశీభట్ల సాయినాథ్ శర్మను పోలీసులు అడ్డుకున్నారు.
మంత్రి పర్యటనను అడ్డుకునేందుకు అఖిలపక్ష పార్టీ నాయకులు కడప హరిత హోటల్ నుంచి ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డగించే ప్రయత్నం చేయగా. తోపులాట జరిగింది. పోలీసులు అఖిలపక్ష పార్టీ నాయకులు అందర్నీ అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. సీఎంను కలిసేందుకు 10 మందిని అనుమతించాలని పోలీసులను అంగన్వాడీల కోరగా ఇద్దర్ని మాత్రమే పంపిస్తామన్నారు. అందుకు అంగీకరించని పోలీసులు అంగన్వాడీలను నిర్బంధించారు.
మూడు రోజుల పర్యటన కోసం కడప వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొలుతబద్వేలు నియోజకవర్గం గోపవరంలో సెంచరీ ఫ్లై పరిశ్రమలో ఎండీఎఫ్ , హెచ్ పీఎల్ ప్లాంట్లను ప్రారంభించారు. అనంతరం కడపలోని రిమ్స్ వద్ద వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, క్యాన్సర్ ఆసుపత్రి, మానసిక వైద్యశాలను ప్రారంభించారు. తర్వాత ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కడప నుంచి ఇడుపులపాయ వెళ్లిన జగన్ ఈ రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, తర్వాత జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. తర్వాత పులివెందుల మండల ప్రజాప్రతినిధులను కలుస్తారు. ఎల్లుండి ఉదయం పులివెందుల సీఎస్ ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com