POLAVARAM: భారీగా పెరిగిన పోలవరం వ్యయం

POLAVARAM: భారీగా పెరిగిన పోలవరం వ్యయం
X
రివర్స్‌ టెండర్లతో పోలవరాన్ని భ్రష్టు పట్టించిన జగన్‌ సర్కార్‌... ఆలస్యమవుతున్నా కొద్దీ పెరుగుతున్న వ్యయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రివర్స్‌ టెండర్ల పేరుతో పోలవరం ప్రాజెక్టును భ్రష్టుపట్టించందన్న వాదనకు బలం చేకురూతోంది. జగన్‌ ప్రభుత్వం అసమర్థత వల్ల పోలవరం అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క ప్రధాన డ్యాంలోనే 4 వేల 890 కోట్ల రూపాయల వ్యయం పెరిగింది. పనులు ఆలస్యం అవుతున్న కొద్దీ ఈ భారం మరింత పెరిగే అవకాశం ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు జగన్‌ ప్రభుత్వం నిధులూ సాధించలేకపోతోంది. అదే సమయంలో నిర్మాణమూ వేగంగా పూర్తి చేయలేకపోతోంది. దీంతో ప్రాజెక్టు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.


పనులు ఆలస్యమయ్యే కొద్దీ ప్రాజెక్టు నిర్మాణ భారమూ పెరిగిపోతోంది. ఒక్క ప్రధాన డ్యాంలోనే 4 వేల 886 కోట్ల 82 లక్షల మేర భారం పెరిగిపోయింది. 2005-06లో ప్రధాన డ్యాం నిర్మించేందుకు నాడు అధికారులు రూపొందించిన అంచనా 3 వేల 931 కోట్ల 54 లక్షల రూపాయలు కాగా ఇప్పుడు 2017-18 నుంచి 2023 లోపు గడిచిన అయిదేళ్లలో ప్రధాన డ్యాం నిర్మాణంలో పెరిగిన అదనపు భారం తొలినాటి అంచనాలను మించిపోయింది. 2017-18 ధరల ప్రకారం పోలవరం అంచనాలను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి సమర్పించగా అనేక తనిఖీల తర్వాత 2019 ఫిబ్రవరిలో ఆ అంచనాలను సాంకేతిక సలహా కమిటీ ఆమోదించింది. ఆ తర్వాత రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీని కేంద్రం నియమించింది. ఆ కమిటీ విద్యుత్‌ కేంద్రం మినహాయిస్తే మొత్తం అంచనాలు 43 వేల 493 కోట్ల 10లక్షలకు సిఫార్సు చేసింది.


2013-14 ధరల్లో ప్రధాన డ్యాం పని విలువ అంచనాలు 8 వేల 969 కోట్ల 44 లక్షలు ఉంటే 2017-18 ధరలకు అది 9 వేల 734 కోట్ల 34 లక్షలకు చేరింది. తాజాగా ధరలు మారకపోయినా జగన్‌ ప్రభుత్వం పనులు సకాలంలో చేయకపోవడం వల్ల అదనపు సమస్యలు తలెత్తాయి. ఆ కొత్త పనులను కూడా కలిపి లెక్కించడం వల్ల ప్రధాన డ్యాం నిర్మాణ అంచనాలే 14 వేల 621 కోట్ల 16 లక్షలకు చేరాయి. జగన్‌ ప్రభుత్వం కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలని ప్రతిపాదించింది. ఆ డ్యాంపై చంద్రబాబు హయాంలో చేసిన వ్యయం సుమారు 400 కోట్ల రూపాయలు జగన్‌ వైఫల్యాల వల్ల వృథాగా మారిపోయినట్లయింది. కొత్తగా డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి అనుమతులు వస్తే ప్రస్తుత ప్రధాన డ్యాం నిర్మాణం అంచనాలు కూడా ఇంకా పెరిగే ప్రమాదం ఉంది.

ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులే తొలిదశలో ఇస్తామని కేంద్రం పేర్కొంది. ఆ మేరకు జగన్‌ ప్రభుత్వం తొలిదశ వరకు 36వేల 449 కోట్ల 83 లక్షలకు ప్రతిపాదనలు పంపింది. కేంద్ర జలసంఘం పరిశీలించి అందులో 4 వేల 824 కోట్ల 45 లక్షలకు కోత పెట్టింది. తొలిదశ కింద 31 వేల 625 కోట్ల 38 లక్షలు ఇచ్చేందుకు సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులపై కేంద్ర జలశక్తి శాఖ రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీని ఏర్పాటు చేసి పరిశీలిస్తోంది. వచ్చే వారంలో ఈ అంచనాలు తుదిదశకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కేంద్ర మంత్రిమండలి ఆమోదిస్తే ఆ మేరకు తొలిదశ నిధులు విడుదలవుతాయి.

Tags

Next Story