AP: ఉవ్వెత్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మె

AP: ఉవ్వెత్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మె
వినూత్న నిరసనలతో కార్మికులు కదం తొక్కుతున్న కార్మికులు... ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపాటు

ఆంధ్రప్రదేశ్ లో సమస్యల పరిష్కారం కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె ఉద్ధృతరూపం దాల్చింది. వినూత్న నిరసనలతో కార్మికులు కదం తొక్కుతున్నారు. హామీల అమలు కోసం పోరాడుతుంటే... మంత్రులు బెదిరింపులకు పాల్పడుతున్నారని పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. వేతన పెంపు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోసం మున్సిపల్‌ సిబ్బంది చేపట్టిన సమ్మె 11వ రోజూ ఉద్ధృతంగా సాగింది. మున్సిపల్‌ కార్యాలయాలు, దీక్షా శిబిరాల వద్ద వినూత్న నిరసనలతో హోరెత్తించారు. కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం చర్చలు, కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు.


ప్రకాశం జిల్లా కనిగిరిలో మున్సిపల్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో బిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట శిరోముండనం చేయించుకునినిరసన తె లిపారు. పుట్టపర్తిలో రోడ్డుపై బైఠాయించి పొర్లుదండాలు పెడుతూ నిరసన తెలిపారు. నెల్లూరు ఇరుకళల పరమేశ్వరీ ఆలయంలో కార్మికులు పొర్లు దండాలు పెట్టి జగన్ మనసు మార్చాలని నినాదాలు చేశారు. కడపలో... ప్రైవేట్ వ్యక్తులతో చెత్త తరలించేందుకు అధికారులు యత్నించగా. కార్మికులు అడ్డుకున్నారు. అడ్డుకున్న కార్మికులను... పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. కడప నగరపాలక కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు శిరో ముండనం చేయించుకుని నిరసన తెలిపారు. ఒంగోలు పురపాలక కార్యాలయం ఎదుట కార్మికులు వంటవార్పు చేపట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మున్సిపల్ కార్మికులు ఉరి వేసుకున్నట్లు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.


గుంటూరులో ఆందోళన చేస్తున్న మున్సిపల్‌ కార్మికులకు.... జనసేన, సీపీఐ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. సంక్రాంతి లోపు డిమాండ్లు నెరవేర్చకుంటే తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడిస్తామని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. బాపట్ల జిల్లా చీరాలలో పారిశుద్ధ్య కార్మికులు వంటావార్పు నిర్వహించి, రోడ్డుపైనే భోజనాలు చేసి నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో మున్సిపల్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది అర్థనగ్న ప్రదర్శన చేశారు. ప్రధాన వీధుల్లో ప్లకార్డులు, ఫ్లెక్సీలతో ర్యాలీ నిర్వహించారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో నిత్యావసర సరుకులతో మున్సిపల్‌ కార్మికులు నిరసన తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఆందోళన ఉద్ధృతం చేశారు. పార్వతీపురం, సాలూరు, పాలకొండ నగర పంచాయతీ వద్ద సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఆందోళన చేశారు. విజయనగరం కార్పొరేషన్ కార్యాలయం వద్ద కార్మికులు మోకాళ్లపై నిలబడి గడ్డి తింటూ నిరసన తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story