AP: ఆందోళనలతో అట్టుడుకుతున్న ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు 21వ రోజూ కదం తొక్కారు. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా వినూత్న నిరసనలతో హోరెత్తించారు. 21 రోజులుగా అలుపెరుగని పోరు సాగిస్తున్నా... జగన్ మనసు కరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు సర్కారుపై సమరం ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళనలు 21 వ రోజూ కొనసాగాయి. డిమాండ్లు నెరవేర్చాలంటూ... కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అంగన్వాడీలు కేకు కట్ చేస్తూ నిరసన తెలిపారు. ఒంగోలులో కలెక్టరేట్ నుంచి మంత్రి ఆదిమూలపు సురేష్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రికి వినతిపత్రం అందించారు. YSR జిల్లా మైదుకూరులో అంగన్వాడీలు కోలాటం చేస్తూ నిరసన తెలిపారు. నంద్యాల తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారిపై కోలాటం, నృత్యాలు చేస్తూ ఆందోళన చేశారు. అనంతపురంలో ఓ అంగన్వాడీ కార్యకర్త కాళికా శక్తి రూప వేషధారణలో నిరసన తెలిపారు.
కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో భజన చేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం... తమకు నాణ్యత లేని చీరలు, చరవాణులు ఇచ్చిందని పి.గన్నవరంలో అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చీరలు, చరవాణులకు పసుపు, కుంకుమతో పూజలు చేస్తూ... సీఎం జగన్ పేరిట వ్యంగ్యంగా మంత్రాలు చదువుతూ... ఆందోళన చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో జానపద పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట I.C.D.S. ప్రాజెక్టు కార్యాలయం వద్ద కబడ్డీ ఆడుతూ ఆందోళన చేశారు. సమస్యలపై సమరాన్ని మరింత ఉద్ధృతం చేసే దిశగా అంగన్వాడీలు సిద్ధమయ్యారు. ఈ నెల 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద బైఠాయించి నిరసన తెలపనున్నట్లు ప్రకటించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ.... నెల్లూరులో కార్పొరేషన్ కార్యాలయం నుంచి గాంధీ బొమ్మవరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో..మున్సిపల్ కార్యాలయం ఎదుట ఒంటికాలుమీద నిలబడి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మున్సిపల్ కార్మికులు గడ్డితింటూ ఆందోళన చేశారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో సమస్యల పరిష్కారం కోసం సమగ్రశిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఉద్ధృతంగా సాగుతోంది. రోజులు తరబడి ఆందోళన చేస్తున్నా జగన్ ప్రభుత్వం
స్పందించకపోవడంపై... నిరసనకారులు భగ్గుమంటున్నారు. ఏలూరులో పాత బస్టాండు కూడలి నుంచి..కలెక్టరేట్ వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. వేతన జీవులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మాట తప్పను... మడమ తిప్పను అంటూనే.. సీఎం జగన్ వంచించారని మండిపడ్డారు. వేతనాలు పెంచి... ఉద్యోగ భద్రత కల్పించాలని లేకుంటే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com