PROTEST: ఆంధ్రప్రదేశ్‌లో హోరెత్తుతున్న ఆందోళనలు

PROTEST: ఆంధ్రప్రదేశ్‌లో హోరెత్తుతున్న ఆందోళనలు
16వ రోజూ ఉద్ధృతంగా సాగిన మున్సిపల్‌ కార్మికుల ఆందోళనలు.... 30వరోజూ వెనక్కి తగ్గని అంగన్‌వాడీలు

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ కార్మికుల సమ్మె 16వ రోజూ హోరెత్తింది. కనీస వేతనాల పెంపు, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు సిబ్బందిని పర్మినెంట్ చేయాలని కోరుతూ కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే సమ్మె ఉద్ధృతమవుతుందని తేల్చి చెప్పారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మె 16వ రోజూ ఉద్ధృతంగా సాగింది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మున్సిపల్ కార్యాలయం వద్ద కళ్లకు గంతలు కట్టుకొనిమోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జగన్ గోవిందా గోవిందా అంటూ నిరసన తెలిపారు. అనంతపురంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడికి కార్మికులు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులతో తీవ్ర తోపులాట జరిగింది. ఆందోళనలో పాల్గొన్న AITUC నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. కళ్యాణదుర్గంలో పారిశుద్ధ్య కార్మికులు ర్యాలీ నిర్వహించారు. బిక్షాటన చేశారు.


నంద్యాలలో మున్సిపల్ కాంటాక్ట్ వర్కర్లు వినూత్న నిరసన తెలిపారు. న్యాయం జరిగే దాకా సమ్మె విరమించేది లేదని రహదారిపై భీష్మించారు. మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట భిక్షాటన చేశారు. కమిషనర్ రవి చంద్రారెడ్డిని బిక్షం వేయాలని ప్రాధేయపడ్డారు. ఒంగోలు మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. చెత్త వాహనాలను అడ్డుకొన్నారు. ప్రైవేట్ వ్యక్తుల చేత పనులు చేయించడాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులతో బెదిరిస్తే సమ్మెను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నెల్లూరులో మున్సిపల్ కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ నినదించారు. కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరుతూ ..విశాఖలో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేశారు. చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వద్ద బైఠాయించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై మానవహారం నిర్వహించారు.


విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట C.P.I. ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేశారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం మొండికేస్తే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మరోవైపు ప్రభుత్వం తమపై మొండిగా వ్యవహరిస్తున్నా... అంగన్వాడీలు 30 రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఎస్మా చట్టాన్నిఅమలు చేసినా జీవో నంబర్‌ 2తో భయభ్రాంతులకు గురిచేసినా పోరాటం మాత్రం ఆపటం లేదు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అంగన్వాడీ కార్యకర్తలు తేల్చి చెబుతున్నారు. N.T.R. జిల్లా నందిగామలో అంగన్వాడీలు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. మెడకు ఉరి తాళ్లు వేసుకుని ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొనసీమ జిల్లా ముమ్మిడివరం I.C.D.S. కార్యాలయం ఎదుట కుర్చీలు నెత్తిన పెట్టుకుని అంగన్వాడీలు నిరసన తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కుర్చీ తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కార్యకర్తలు హెచ్చరించారు. డిమాండ్లు పరిష్కరించమంటే సీఎం జగన్‌ అణచివేతకు గరిచేస్తున్నారని కాకినాడలో అంగన్వాడీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంక్రాంతి పండుగను సైతం దీక్షా శిబిరాల్లోనే జరుపుకుంటామని... హామీలు నెరవేర్చేవరకు నిరసనలు కొనసాగిస్తామని కార్యకర్తలు తేల్చిచెప్పారు. ఎస్మా చట్టాన్ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని కోరుతూ విశాఖ G.V.M.C. గాంధీ పార్కు వద్ద అంగన్వాడీలు నిరసన తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అంగన్వాడీలు చేస్తున్న నిరసన దీక్షకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మద్దతు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story