AP: ఏపీలో ఎటుచూసిన నిరసనలే.. ఎవరినీ కదిపినా బాధలే

AP: ఏపీలో ఎటుచూసిన నిరసనలే.. ఎవరినీ కదిపినా బాధలే
అనకాపల్లి లో కలెక్టరేట్ వద్ద సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా... అనంతపురంలో రొడ్డేక్కిన విద్యార్థులు

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆందోళనలే కన్పిస్తున్నాయి. సీఎం జగన్‌ పాలనలో అయిదేళ్లు విసిగిపోయిన ప్రజలు ఒక్కొక్కరే బయటకువస్తూ ప్రభుత్వం తమకు చేసిన అన్యాయాలను ప్రశ్నిస్తున్నారు. ఆందోళనలతో తమ డిమాండ్ల కోసం నినదిస్తున్నారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రాంతంతో సంబంధం లేకుండా వారి వారి సమస్యలపై ప్రజలు పోరాటాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, సామాన్య ప్రజలు....ఇలా ఎవరికి వారే తమ సమస్యలపై ప్రభుత్వంతో యుద్ధం కొనసాగిస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేసిన జగన్‌ తమ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని...కానీ, అధికారంలోకి రాగానే వాటిని విస్మరించారని వెలుగు V.V.O.Aలు ఆరోపిస్తున్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ మేరకు ధర్నా నిర్వహించారు. కనీస వేతనాన్ని 21 వేల రూపాయలకు పెంచాలని,3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యూలర్‌ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ అటు శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద V.V.O.Aలు ధర్నా చేపట్టారు. ఏపీ వెలుగు యానిమేటర్స్ ఉద్యోగుల సంఘంతో పాటు సీఐటీయూ ఆధ్వర్యంలో....కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. HR పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించింది. నిధులు కాజేయడాన్ని నిరసిస్తూ అనకాపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 8వేల 629 కోట్ల రూపాయలను సీఎం జగన్ మోహన్ రెడ్డి పంచాయతీల నుంచి దొంగలించారని ఆరోపించారు. వాలంటరీ, సచివాలయ లాంటి సమాంతర వ్యవస్థలను ఏర్పాటు చేసి గ్రామపంచాయతీలను నిర్వీర్యం చేశారన్నారు. వాలంటీర్లకు గౌరవ వేతనం 5వేల రూపాయలు ఇస్తుండగా, గ్రామ సర్పంచ్లకు 3000 ఇస్తున్నారని దుయ్యబట్టారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే రాబోయే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని సర్పంచ్‌ల సంఘం నేతలు అంటున్నారు.

విద్యార్థులకు మేనమామగా ఉంటానంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు జగన్‌. గెలిచాక మాత్రం తమ సమస్యలను పట్టించుకోవడంలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని సమస్యలను పరిష్కరించాలని అనంతపురంలో విద్యార్థులు రొడ్డేక్కారు. పెండింగ్‌లో ఉన్న కాస్మోటిక్, మెస్ ఛార్జీలు వెంటనే చెల్లించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. కేవలం అనంతపురం జిల్లాలోనే 7కోట్ల 20 లక్షల మెస్ బిల్లులు రావాల్సి ఉందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు జగన్‌ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story