AP: ఏపీలో ఉద్రిక్తంగా ఉద్యోగుల ఆందోళన

విజయవాడ పటమటలోని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారింది. డిమాండ్లు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి సమగ్ర శిక్ష కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విజయవాడకు తరలివచ్చారు. ఆందోళనకారులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. SSA ప్రాజెక్టు డైరెక్టర్‌తో ఉద్యోగులు జరిపిన చర్చలు విఫలమవడంతో సమ్మె కొనసాగించాలని నిర్ణయించినట్లు ఐకాస నేతలు తెలిపారు. సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు SSA కార్యాలయం వద్దకు రావటంతో పోలీసులు ఉద్యోగులను నిర్బంధించారు. కొందరిని స్టేషన్లకు తరలించగా మరికొందరిని ఆటోనగర్‌లోని ఆటోమెబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ హాలుకు తరలించారు. గత నెల 20 నుంచి వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరవైందని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం అణచివేసేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు.
న్యాయమైన డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్నామే తప్ప గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్షలో అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి, వారి సేవలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో పాటు సీఎంకు, ప్రాజెక్టు డైరెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగుల్ని అధికారులు చర్చలకు ఆహ్వానించారు. ఉద్యోగుల డిమాండ్లపై ప్రాజెక్టు డైరెక్టర్ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో చర్చలు విఫలమైనట్లు ఐకాస నేతలు తెలిపారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు పట్టు వీడేది లేదని తెలిపారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో సమస్యల పరిష్కారం కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె ఉద్ధృతరూపం దాల్చింది. వినూత్న నిరసనలతో కార్మికులు కదం తొక్కుతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో మున్సిపల్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది. అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో బిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట శిరోముండనం చేయించుకుని నిరసన తెలిపారు. పుట్టపర్తిలో రోడ్డుపై బైఠాయించి పొర్లుదండాలు పెడుతూ నిరసన తెలిపారు. నెల్లూరు ఇరుకళల పరమేశ్వరీ ఆలయంలో కార్మికులు పొర్లు దండాలు పెట్టి జగన్ మనసు మార్చాలని నినాదాలు చేశారు. కడపలో... ప్రైవేట్ వ్యక్తులతో చెత్త తరలించేందుకు అధికారులు యత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. అడ్డుకున్న కార్మికులను. పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. కడప నగరపాలక కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు శిరో ముండనం చేయించుకుని నిరసన తెలిపారు. ఒంగోలు పురపాలక కార్యాలయం ఎదుట కార్మికులు వంటవార్పు చేపట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మున్సిపల్ కార్మికులు ఉరి వేసుకున్నట్లు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com