SAD: జగన్‌ సొంత జిల్లాలో దారుణం

SAD: జగన్‌ సొంత జిల్లాలో దారుణం
తమ భూమిని మరొకరి పేరుకు మార్చారని ముగ్గురి ఆత్మహత్య...

YSR జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో తీరని విషాదం నెలకొంది. రెవెన్యూ అధికారులు తమ భూమిని మరొకరి పేరుకు మార్చారని లేఖ రాసి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన సీఎం సొంత జిల్లాలో జరగడం చర్చనీయాంశంగా మారింది. లంచం ముట్టజెప్పినప్పటికీ ప్రభుత్వాధికారులు న్యాయం చేయనందునే బలవన్మరణం చెందినట్లు బంధువులు చెబుతున్నారు.


ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేకెత్తించింది. కొత్త మాధవరానికి చెందిన పాల సుబ్బారావు ఒంటిమిట్ట చెరువుపక్కన రైలుకింద పడి ప్రాణాలు తీసుకోగా.... ఆయన భార్య పద్మావతి, కుమార్తె వినయ... ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. సుబ్బారావు పెద్ద కుమార్తె చదువు కోసం హైదరాబాద్ వెళ్లినట్లు తెలిసింది. ఒంటిమిట్ట సీఐ పురుషోత్తం రాజు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులకు సూసైడ్‌ నోట్‌ లభించింది.


పాల సుబ్బారావుకు ఒంటిమిట్ట మండలం మాధవరంలో 3.10 ఎకరాల భూమి ఉంది. కొద్ది సంవత్సరాల క్రితం తన పేరుతో ఉన్న భూమిని రెవెన్యూ అధికారులు కట్టా శ్రావణి అనే ఆమె పేరుతో ఆన్‌లైన్‌లో మార్చారు. మూడెకరాల పొలం అమ్ముదామని చూస్తే ఆ భూమి..... శ్రావణి అనే పేరున ఉన్నట్టు రెవెన్యూ అధికారులు చెప్పగా కంగుతున్నారు. ఈ భూమిని తిరిగి తన పేరుతో మార్చుకోవడానికి రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా, రెవెన్యూ అధికారులకు ముడుపులు మొట్ట చెప్పినా సుబ్బారావుకు ప్రయోజనం దక్కలేదు. దీంతో విరక్తి చెంది..ఇక భూమి అమ్మలేమని తెలుసుకొని... రైలు పట్టాలపై పడి సుబ్బారావు ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలంలో లభించిన లేఖలో ఈ విషయాలన్నీ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story