AP : వైసీపీకి షాక్ .. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే ఆర్థర్

AP : వైసీపీకి షాక్ ..  కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే ఆర్థర్

నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ (MLA Arthur) కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ షర్మిల (YS Sharmila) సమక్షంలో ఇవాళ హస్తం కండువా కప్పుకున్నారు. ఆర్థర్‌ను వైఎస్ షర్మిల పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ టికెట్ దారా సుధీర్‌కు కేటాయించడం, బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో విభేదాల నేపథ్యంలో ఆర్థర్ పార్టీ మారినట్లు తెలుస్తోంది. ఆర్థర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నందికొట్కూరు నుంచి పోటీచేసే అవకాశం ఉంది. ఈ నెల 25న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం. ఈ జాబితాలో ఆర్థర్ పేరు ఉంటుందని ఆయన అభిమానులు, అనుచరులు ఆశిస్తున్నారు.

ఇదిలా ఉంటే నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కీలక నేతగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆర్థర్ గెలుపుకు కృషి చేసిన బైరెడ్డే.. ఇప్పుడు ఆయనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆర్థర్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గాల మధ్య అధిపత్యపోరు తలెత్తింది. పార్టీ అధిష్టానం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గానికే మద్దతుగా నిలవడంతో ఎమ్మెల్యే ఆర్థర్‌ నియోజకవర్గంలో ఒంటరయ్యారు. ఇదే సమయంలో ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్థాపం చెందిన ఆర్థర్ వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Tags

Read MoreRead Less
Next Story